రాఘవ్ చద్దా సహా ఆ ఆరుగురిపై అనర్హత వేటు పడుతుందా? రాజ్యాంగ చట్టం ఏం చెబుతోంది?

by Naga Rani Yarlagadda |

ఆప్ కు ఏడుగురు ఎంపీలు రాజీనామా ప్రకటించడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. మరి ఈ ఏడుగురిపై వేటు పడుతుందా? రాజ్యాంగంలో ఏముంది?

రాఘవ్ చద్దా సహా ఆ ఆరుగురిపై అనర్హత వేటు పడుతుందా? రాజ్యాంగ చట్టం ఏం చెబుతోంది?
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చడ్డా, స్వాతి మాలివాల్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు తీసుకున్న నిర్ణయం దేశ రాజధానిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సభలో మొత్తం 10 మంది ఎంపీలలో ఏడుగురు (అంటే 2/3 వంతు మెజారిటీ) బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. వీరంతా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ పరిణామంపై ఆప్ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వీరిని ద్రోహులుగా అభివర్ణించగా, ఎంపీ సంజయ్ సింగ్ మరింత ఘాటుగా స్పందించారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన బీజేపీలో చేరిన తర్వాత, రాఘవ్ చడ్డా తనను తాను నీతిమంతుడిగా చెప్పుకోలేరని విమర్శించారు.

పెద్ద చిక్కుముడి: ఎంపీ పదవులు ఊడతాయా?

ఇప్పుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న.. పార్టీ మారిన ఈ ఏడుగురు ఎంపీల సభ్యత్వం రద్దవుతుందా? రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపు నిరోధక చట్టం) ప్రకారం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే.. అదే షెడ్యూల్‌లోని 4వ క్లాజ్ ఒక వెసులుబాటును కల్పిస్తోంది. ఒక పార్టీలోని శాసనసభాపక్షం (Legislature Party) లో కనీసం 2/3 వంతు సభ్యులు వేరే పార్టీలో విలీనానికి అంగీకరిస్తే, వారిపై అనర్హత వేటు పడదని ఆ నిబంధన చెబుతోందని India Todayలో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ లో పేర్కొన్నారు.

నిపుణుల వాదన: చట్టం ఏం చెబుతోంది?

సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ దీనిపై విశ్లేషిస్తూ.. రాజ్యసభలో 2/3 వంతు సభ్యులు విలీనానికి అంగీకరించారు కాబట్టి వారి సీట్లకు ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ మూల రాజకీయ పార్టీ విలీనం కానక్కర్లేదు, సభలోని మెజారిటీ సభ్యులు నిర్ణయం తీసుకుంటే అది చట్టబద్ధమైన విలీనంగానే పరిగణించబడుతుంది అని ఆయన పేర్కొన్నారు. అయితే.. సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే దీనితో విభేదించారు. పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ అనే రెండు సభలు ఉంటాయని, కేవలం ఒక సభలోని 2/3 వంతు సభ్యులు మారితే సరిపోదని, మొత్తం పార్లమెంటు సభ్యులలో (రెండు సభలు కలిపి) 2/3 వంతు మెజారిటీ ఉండాలని ఆయన వాదిస్తున్నారు.

పార్టీ చీలిపోయినట్లేనా? ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?

శివసేన కేసులాగా ఇది పార్టీ యాజమాన్యం కోసం జరుగుతున్న పోరాటం కాదని నిపుణులు చెబుతున్నారు. రాఘవ్ చడ్డా బృందం మేమే అసలైన ఆప్ అని క్లెయిమ్ చేయడం లేదు. కేవలం రాజీనామా చేసి విలీనం అవుతున్నారు. కాబట్టి పార్టీ గుర్తు, క్యాడర్ ఎవరికి చెందుతుందనే వివాదం ఇక్కడ తలెత్తదు. కానీ.. రాజకీయంగా ఇది ఆప్ ఉనికిని దెబ్బతీసే అంశమే. ఒకవేళ ఆప్ ఈ ఎంపీలపై అనర్హత పిటిషన్ వేస్తే, తుది నిర్ణయం రాజ్యసభ ఛైర్మన్ (ఉపరాష్ట్రపతి) సి.పి. రాధాకృష్ణన్ చేతుల్లో ఉంటుంది.

Next Story