- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెలెబీకి హైకోర్టులో చుక్కెదురు.. ముందు జాగ్రత్తే మంచిదన్న కోర్టు
సెలెబీకి హైకోర్టులో చుక్కెదురైంది. సెక్యూరిటీ క్లియరెన్స్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని కోర్టు చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: టర్కీకి చెందిన సెలెబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టుకెక్కిన సెలెబీ.. ‘దేశ భద్రత కారణంగా’ అనే చిన్న మాటతో వందలాది మంది ఉద్యోగాలకు నష్టం చేకూర్చడం సరికాదని పేర్కొంది. అయితే ‘ఇలాంటి విషయాల్లో ఏదైనా జరిగే వరకు వేచిచూడకుండా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది’ అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ‘మాకు ఎలాంటి కారణం చెప్పలేదు. మా వైపు వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు. మా కంపెనీ షేర్‌హోల్డర్లు టర్కీకి చెందిన వారు కాబట్టి ప్రజాగ్రహం ఎదుర్కొంటున్నారు. కేవలం ఈ కారణంతోనే మా క్లియరెన్స్ రద్దు చేసినట్లు కనిపిస్తోంది’ అని సెలెబీ తెలిపింది. ఈ కంపెనీ తరఫున ముకుల్ రోహత్కీ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఎయిర్‌పోర్టుల్లో కార్యకలాపాలను సెలెబీ నిర్వహిస్తుందని గుర్తుచేశారు. ‘ఇలాంటి వ్యక్తులకు విమానాల్లో, విమానాశ్రయాల్లో అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రయాణీకుల లగేజ్ కార్గో కాదు. అన్ని విమానాల్లో ప్రయాణికులు, కార్గో ఉంటాయి. ఇది పౌరవిమానయాన రంగంతోపాటు దేశ భద్రత, సార్వభౌమాధికారానికి చాలా సున్నితమైన విషయం’ అని తెలిపారు. శత్రువులు పది ప్రయత్నాలు చేసి ఒక్క సారి విజయవంతమైతే చాలని, అదే భద్రతా దళాలు మాత్రం పదిసార్లూ విజయవంతం అవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందుకే పౌరవిమానయాన రంగంలో దేశ భద్రతకు అత్యున్నత ప్రాముఖ్యత ఉంటుందని వివరించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను మే 21 వరకు వాయిదా వేసింది. అలాగే ఏ చట్టం ప్రకారం సెలెబీకి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేశారో చెప్పాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోరింది.






