మెజార్టీ కోల్పోయిన నెతన్యాహు సర్కారు.. హమాస్‌తో సీజ్‌ఫైర్‌పై ఎఫెక్ట్?

by Phanindra |

ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహు సర్కారు మెజార్టీ కోల్పోయింది. దీని ప్రభావం హమాస్‌తో సీజ్‌ఫైర్‌ ఒప్పందంపై పడే అవకాశాలున్నాయి.

మెజార్టీ కోల్పోయిన నెతన్యాహు సర్కారు.. హమాస్‌తో సీజ్‌ఫైర్‌పై ఎఫెక్ట్?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు గట్టి షాక్ తగిలింది. ఆయన కూటమి ఇజ్రాయెల్ పార్లమెంటులో మెజార్టీ కోల్పోయింది. అట్ట్రా ఆర్థడాక్స్ పార్టీల్లో ఒకటైన షాస్ పార్టీ.. నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మతపరమైన విద్యార్థులకు మిలిటరీ సేవల నుంచి మినహాయింపు ఇవ్వాలనే డ్రాఫ్ట్ బిల్లుపై షాస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది.

ఇదే బిల్లు విషయంలో మరో అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీ అయిన యునైటెడ్ టోరా జుడాయిజం (యూటీజే) కూడా ప్రభుత్వ కూటమి నుంచి ఇటీవలే బయటకు వచ్చేసింది. ఇప్పుడు షాస్ పార్టీ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్లమెంటులో నెతన్యాహు ప్రభుత్వం మెజార్టీ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. దీంతో రైట్ వింగ్ పార్టీల నుంచి వచ్చే ఒత్తిడిని నెతన్యాహు ఎలా తట్టుకుంటారని తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.

అయితే తాము ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదని, పలు బిల్లుల విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని షాస్ పార్టీ ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య సీజ్‌ఫైర్ కోసం యూఎస్ చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా జరగడం నెతన్యాహు ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే హమాస్ ఉనికి ఏమాత్రం ఉంటుందన్నా సరే ఇజ్రాయెల్‌లోని సంప్రదాయక పార్టీలు సహించడం లేదు. హమాస్‌ నిర్మూలనే వారి డిమాండ్. దీంతో యూఎస్ ఎలాంటి ప్రతిపాదన చేసినా దానికి నెతన్యాహు సర్కారు ఒప్పుకోవడం సమస్యగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

Next Story