- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై బీజేపీ నిరసనలు
ఈ విషాదానికి ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్న ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదివారం నిరసనలు చేపట్టారు. విధాన సౌధ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు జరిగిన నిరసనకు ప్రతిపక్ష నేతలు ఆర్. అశోక, చలవాడి నారాయణస్వామి నాయకత్వం వహించారు. ఈ విషాదానికి ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్న ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ, నిరసనకారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని ఆరోపించారు. ఈ ఘటనలో సీఎం, డిప్యూటీ సీఎంలను 'హంతకులు' అని పేర్కొంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు త్వరలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి, ఈ విషయంలో జోక్యం చేసుకుని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. నిరసన సందర్భంగా అశోక మాట్లాడుతూ, సిద్ధరామయ్య, శివకుమార్‌లను 'రియల్ కల్ప్‌ప్రిట్స్ ఆఫ్ బెంగళూరు(ఆర్‌సీబీ)' అంటూ మృతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులకు అండగా బీజేపీ
ఈ సంఘటనకు సంబంధించి అప్పటి బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానందతో సహా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడాన్ని బీజేపీ విమర్శించింది. బీజేపీ పోలీసులకు అండగా నిలుస్తుందని, ఈ ఘటనలో వారి తప్పు లేదని, వారి తరపున పోరాడుతుందని అశోక అన్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ నేతలు విజయోత్సవ వేడుకలు నిర్వహించారని ఆయన ఆరోపించారు. పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం 'ప్రభుత్వ ప్రాయోజిత హత్య' తప్ప మరొకటి కాదు.
చట్టం దృష్టిలో నిందితులు
సీఎం, డిప్యూటీ సీఎం సహా అధికారంలో ఉన్నవారు పదకొండు మంది మృతదేహాలపై రాష్ట్రాన్ని పాలించలేరని ఆయన అన్నారు. 'మీకు నైతిక హక్కు లేదు, దాన్ని కోల్పోయారు. చట్టం దృష్టిలో మీరు నిందితులు' అని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జూన్ 4న 3.15 గంటలకు మొదటి మరణం సంభవిస్తే, విజయోత్సవ వేడుకలు సాయంత్రం 4:30-5 గంటలకు ప్రారంభమయ్యాయి. అప్పటికి ఏడెనిమిది మంది మరణించారు. డిప్యూటీ సీఎం స్టేడియంకు వెళ్లిన తర్వాత సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో రూ. 1 కోటి విలువైన క్రాకర్లు కాల్చారు. 11 మరణాల సంభవించిన తర్వాత టపాసులు పేల్చిన మీకు మానవత్వం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.






