Traffic Index: ప్రపంచంలోనే ట్రాఫిక్ అత్యధికంగా ఉన్న రెండో నగరంగా బెంగళూరు

by S Gopi |

ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులోని డ్రైవర్లు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Traffic Index: ప్రపంచంలోనే ట్రాఫిక్ అత్యధికంగా ఉన్న రెండో నగరంగా బెంగళూరు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు చోటు సంపాదించుకుంది. నెదర్లాండ్‌కు చెందిన టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం, 2025లో మెక్సికో సిటీ తర్వాత బెంగళూరు రెండో అత్యంత రద్దీ ఉన్న నగరంగా నిలిచింది. దీనర్థం, ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులోని డ్రైవర్లు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత సంవత్సరం బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ స్థాయి 74.4 శాతంతో చాలా ఎక్కువగా ఉంది, ఇది 2024లో ఉన్న దాని కంటే కూడా అత్యధికం. మెక్సికో సిటీ 75.9 శాతం స్కోరుతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరులో వాహనాల సగటు స్పీడ్ గంటకు సుమారు 16.6 కి.మీకు పడిపోయింది. రద్దీ సమయాల్లో కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా తరచుగా అరగంట కంటే ఎక్కువ సమయం పట్టింది. సగటున, ప్రయాణికులు సంవత్సరానికి ట్రాఫిక్ ఆలస్యాల కారణంగా సుమారు 168 గంటలు (ఒక వారం కంటే ఎక్కువ) కోల్పోయారు. 15 నిమిషాల్లో వాహనాలు సగటున 4.2 కి.మీ దూరం మాత్రమే వెళ్తున్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే కొంచెం తక్కువ. ముఖ్యంగా గతేడాది మే 17 అత్యంత రద్దీ ఉన్న రోజుగా నమోదైంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు రద్దీ 183 శాతానికి పెరిగింది, డ్రైవర్లు 15 నిమిషాల్లో కేవలం 2.5 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే ప్రయాణించారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఇతర నగరాలు కూడా స్థానం పొందాయి. పూణే 71.1 శాతం సగటు రద్దీతో ఐదవ, 60.2 శాతం రద్దీతో దేశ రాజధాని ఢిల్లీ 23వ ర్యాంకు, 55.5 శాతంతో హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచాయి. 63.2 శాతంతో ముంబై 18వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా, డబ్లిన్ (72.9 శాతం), లాడ్జ్, పోలాండ్ (72.8 శాతం), బొగోటా, కొలంబియా (69.6 శాతం) వంటి నగరాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

Next Story