బెంగాల్‌లో హైడ్రామా : ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌

by Dishanational4 |
బెంగాల్‌లో హైడ్రామా : ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. సందేశ్‌ఖాలీ గ్రామంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై అల్లరిమూకల దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను బెంగాల్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. బుధవారం సాయంత్రం 4.15 గంటల కల్లా అతడిని సీబీఐకి అప్పగించాలంటూ కోల్‌కతా హైకోర్టు విధించిన డెడ్‌లైన్‌ అమలులో భాగంగా తాజా పరిణామం చోటుచేసుకుంది. దీంతో మంగళవారం నుంచి బెంగాల్‌ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. సందేశ్‌ఖాలీలో దోపిడీ, భూకబ్జాలు, లైంగిక వేధింపుల కేసుల్లో షాజహాన్‌ షేక్‌ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో షాజహాన్‌ షేక్‌‌ను ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ ఆరుసంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది.

సీఐడీ ప్రధాన కార్యాలయానికి సీబీఐ వెళ్లినా..

వాస్తవానికి షాజహాన్‌ షేక్‌ను సీబీఐకి అప్పగించాలని మంగళవారం ఉదయమే కోల్‌కతా హైకోర్టు బెంగాల్ పోలీసులను ఆదేశించింది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకల్లా సీబీఐ అధికారులకు అతడిని అప్పగించాలని నిర్దేశించింది. అయితే దీనిపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కానీ ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ జరపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగి మంగళవారం సాయంత్రానికే షాజహాన్‌పై కేసు నమోదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారుల బృందం.. కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున షాజహాన్‌ షేక్‌ను అప్పగించేందుకు బెంగాల్‌ పోలీసులు నో చెప్పారు. దీంతో ఖాళీ చేతులతో సీబీఐ టీమ్ వెనుతిరిగింది. ఈనేపథ్యంలో బుధవారం ఉదయం సీబీఐ మరోసారి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించి పోలీసుల తీరును వివరించింది. బెంగాల్ సీఐడీపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని కోరింది. సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి స్టే విధించకపోవడంతో బెంగాల్‌ పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు.. బుధవారం సాయంత్రం 4.15 గంటల కల్లా నిందితుడిని సీబీఐకి అప్పగించాలని ఆర్డర్ ఇచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం షాజహాన్‌ షేక్‌తో పాటు కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ బెంగాల్‌ పోలీసులు సీబీఐకి అప్పగించారు.


Next Story

Most Viewed