బెంగాల్ బాంబుల రికవరీ కేసు.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. టెర్రర్ కోణంలో దర్యాప్తు!

by Malleboina Mahesh |

బెంగాల్ బాంబుల కేసులో ఎన్ఐఏ ఎంట్రీ! 79 క్రూడ్ బాంబుల రికవరీపై టెర్రర్ కోణంలో దర్యాప్తు ప్రారంభం. ఎన్నికల వేళ భద్రతా సంస్థల హై అలర్ట్.

బెంగాల్ బాంబుల రికవరీ కేసు.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. టెర్రర్ కోణంలో దర్యాప్తు!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలో భారీగా క్రూడ్ బాంబులు పట్టుబడ్డాయి. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారుజామున ఎన్ఐఏ కొత్తగా ఎఫ్ఐఆర్ (RC-25/2026/NIA/DLI) నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.

కేసు నేపథ్యం, రికవరీ

ఏప్రిల్ 25న కోల్‌కతాలోని భంగర్ డివిజన్ పరిధిలోని ఉత్తర కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాఝేర్హత్ (పొయిలేపరా) గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఈ బాంబులను గుర్తించారు. మొత్తం 79 క్రూడ్ బాంబులను, జనపనార తాళ్లతో కట్టిన గుండ్రటి పేలుడు పదార్థాలను, బాంబుల తయారీకి ఉపయోగించే ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం వెనుక దేశ భద్రతకు ముప్పు కలిగించే కుట్ర ఉందని కేంద్రం భావిస్తోంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు, ఏదైనా పెద్ద ఉగ్రవాద చర్యకు ప్రణాళిక వేసి ఉండవచ్చనే కోణంలో ఎన్ఐఏ విచారణ చేపట్టింది.

రాజకీయ వేడి..

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ (2026) కొనసాగుతున్న తరుణంలో ఈ బాంబులు బయటపడటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీఎంసీ, ప్రత్యర్థి పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో స్థానిక బలమైన నాయకుడు వహిదుల్ ఇస్లాం పాత్రపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో జరిగిన మరో పేలుడు కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎంసీనే అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో NIA అధికారుల విచారణ ప్రత్యేకతను సంతరించుకుంది.

Next Story