ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే: అరవింద్ కేజ్రీవాల్

by Dishanational1 |
ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే: అరవింద్ కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన ప్రజాకేంద్రక రాజకీయం, పనితీరుతో ప్రజలలో ఆదరణ, ఆమోదం పొందిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మనం ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నేతలతో వర్చువల్‌గా మాట్లాడిన ఆప్ అధినేత, 'ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించిన కేసులో జైల్లో ఉన్న ఐదుగురు ఆప్ పార్టీ నేతలను చూసి తాను గర్వపడుతున్నానని' తెలిపారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు వెళ్లాల్సిందేనని, అందుకు మనం సిద్ధంగా ఉండాలన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జనవరి 3న హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు పంపిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. లాయర్లతో తాను నిరంతరం టచ్‌లో ఉన్నానని, జైల్లో ఉన్నా తమ నాయకులందరిలో ఉత్సాహం ఉండటం మంచి విషయం. మరే ఇతర పార్టీలు దృష్టి సారించని విషయాలపై ఆప్ పనిచేయడం వల్లే పార్టీ రాజకీయాల్లో ఎదిగిందన్నారు. 'మేము విద్య, ఆరోగ్యం, విద్యుత్, ద్రవ్యోల్బణం, ఉపాధి గురించి మాట్లాడాం. ఈ పని వేరే ఇతర పార్టీలు చేయలేదు. దేశంలో మొదటిసారిగా ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం లభించింది. ఈ రాజకీయాలను ప్రజలు ఇష్టపడటం ప్రారంభించారని' కేజ్రీవాల్ వెల్లడించారు.


Next Story

Most Viewed