- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష
ఆమెతో పాటు ఈ కేసులో గోబిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్‌బుల్‌కు కూడా ట్రిబ్యునల్ రెండు నెలల శిక్ష విధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా జైలుకు వెళ్లనున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఐసీటీ ఛైర్మన్ జస్టిస్ మహమ్మద్ గోలం మొర్టుజా మొజుందార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చిందని బుధవారం ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. షేక్ హసీనా చేసిన లేదా లొంగిపోయిన రోజు నుంచి ఈ శిక్ష అమల్లోకి వస్తుంది. ఆమెతో పాటు ఈ కేసులో గైబంధలోని గోబిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్‌బుల్‌కు కూడా ట్రిబ్యునల్ రెండు నెలల శిక్ష విధించింది. షకీల్ ఢాకాకు చెందిన రాజకీయ నేత, అతనికి అవామి లీగ్ విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛత్ర లీగ్(బీసీఎల్)తో సంబంధాలున్నాయి.
ఇదే తొలిసారి
గతేడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో ప్రధాని పదవిని కోల్పోయిన షేక్ హసీనా, దేశాన్ని వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరికొందరు కీలక అధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. గతేడాది జూన్‌లో ఢాకా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం కూడా షేక్ హసీనాను సొంత దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కోర్డు ధిక్కరణ కింద హసీనాకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ ఐసీటీ తీర్పు ఇచ్చింది. అవామీ లీగ్ చీఫ్‌ను పదవి నుంచి తొలగించిన తర్వాత ఒక కేసులో దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి.
అసలు కేసేంటి?
షేక్ హసీనాపై ధిక్కార కేసు గతేడాది అక్టోబర్‌లో షకీల్ అకాండ్ బుల్బుల్‌తో ఆమె మాట్లాడినట్టుగా లీక్ అయిన ఫోన్ కాల్ ఆధారంగా నమోదైందని ఢాకా ట్రిబ్యూన్ కథనం పేర్కొంది. షేక్ హసీనా గొంతుగా భావిస్తున్న ఆ ఆడియోలో.. 'నాపై 227 కేసులు నమోదయ్యాయి, కాబట్టి నేను 227 మందిని చంపడానికి లైసెన్స్ పొందాను' అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన న్యాయ ప్రక్రియను బెదిరించడం, గతేడాది సామూహిక తిరుగుబాటుకు సంబంధించి కొనసాగుతున్న యుద్ధ నేరాల విచారణలో పాల్గొన్న వారిని బెదిరించడానికి ప్రయత్నించడమని, ఇది కోర్టు ధిక్కారానికి సమానమని ప్రాసిక్యూషన్ వాదించింది.






