Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. ట్రాన్స్-షిప్‌మెంట్ ఫెసిలిటీ రద్దు చేసిన భారత్

by B.Srinivas |

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ బంగ్గాదేశ్ సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే.

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. ట్రాన్స్-షిప్‌మెంట్ ఫెసిలిటీ రద్దు చేసిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ (Mohammad Yunus) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ బంగ్గాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వస్తువులను ఇతర దేశాలను పంపడానికి అనుమతించే ట్రాన్స్-షిప్‌మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC) ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆర్డర్ వచ్చిన వెంటనే ఈ సౌకర్యాన్ని మూసివేసినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అధిపతి అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటికే భారతదేశానికి చేరుకున్న వస్తువులు పాత నిబంధనల ప్రకారం బయటకు వెళ్ళడానికి అనుమతిస్తామని చెప్పారు. అయితే, ఈ చర్యలు నేపాల్, భూటాన్‌కు బంగ్లాదేశ్ ఎగుమతులను భారత భూభాగం గుండా రవాణా చేయడంపై ప్రభావం చూపబోవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2020 నుంచి ఇరు దేశాల మధ్య ట్రాన్స్ షిప్ మెంట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.

కాగా, భారత్ తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్ ఎగుమతులు, దిగుమతులను ప్రభావితం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా భూటాన్, నేపాల్, మయన్మార్‌లతో వాణిజ్యంలో సమస్యలు ఉంటాయి. ఈ దేశాలు మూడో దేశాలతో వాణిజ్యం కోసం భారత మార్గాలపై ఆధారపడతాయి. గతంలో భారత్ గుండా మార్గం సులభంగా ఉండేది. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అయ్యేవి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాపారులకు ఎక్కువ సమయం, ఖర్చులు పెరిగి అనిశ్చితి నెలకొనే పరిస్థితి ఏర్పడనుంది. అయితే చైనాలో యూనస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story