Bangladesh: మనస్సాక్షితో ఆలోచించండి.. షేక్ హసీనాను అప్పగింతపై బంగ్లా అభ్యర్థన

by S Gopi |

మనస్సాక్షితో ఆలోచించి, నైతిక విలువలకు కట్టుబడి ఆమెను అప్పగించే ప్రక్రియ చేపట్టాలని కొత్త ప్రతిపాదనను ఉంచింది.

Bangladesh: మనస్సాక్షితో ఆలోచించండి.. షేక్ హసీనాను అప్పగింతపై బంగ్లా అభ్యర్థన
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఆమె తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తమ దేశానికి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్‌కు లేఖలు రాసింది. అయితే, భారత్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా హసీనాకు సంబంధించిన ఆడియో ఒకటి బయటకు రావడంతో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మరొకసారి భారత్‌కు విజ్ఞప్తులు చేసింది. ఆమె మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన నేరాలను ఎదుర్కొంటున్నారు. మనస్సాక్షితో ఆలోచించి, నైతిక విలువలకు కట్టుబడి ఆమెను అప్పగించే ప్రక్రియ చేపట్టాలని కొత్త ప్రతిపాదనను ఉంచింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనర్ పేరు మీద ప్రెస్ సెక్రటరీ ప్రకటన విడుదలైంది.

షేక్ హసీనా అప్పగింత వ్యవహారాన్ని ఎక్కువకాలం సాగదీయడం సరైన నిర్ణయం కాదు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలను ఎదుర్కొంటున వ్యక్తికి భారత్ రక్షణ కల్పించడం సబబు కాదని యూనస్ లేఖలో పేర్కొన్నారు. సామాన్య ప్రజలను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసిన వ్యక్తులను ప్రాంతీయ బంధం, రాజకీయ వారసత్వం కాపాడదని స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో భారత్ ప్రజాస్వామ్య ఉమ్మడి విలువను, చట్టబద్ద పాలనను గౌరవించాలని, ఎంత బలమైన నేతలైనా చట్టం ముందు ఒకటేనని, బాధితులకు న్యాయం అందించాలని వివరించారు.

కాగా, హసీనా ప్రభుత్వం నిరసనకారులపై భద్రతా చర్యలకు ఆదేశించడంతో గత ఏడాది జూలై 15-ఆగస్టు 15 మధ్య 1,400 మంది వరకు మరణించారు. మానవత్వానికి విరుద్ధంగా జరిగిన నేరాల్లో భాగంగా ఆమెతో పాటు కొందరు ప్రభుత్వాధికారులు, 200 మందికి పైగా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్(ఐసీటీ) శిక్ష విధించింది. హసీనాకు కోర్టు ధిక్కార కేసు కింద ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 77 ఏళ్ల అవామీ లీగ్ నాయకురాలికి ఒక కేసులో శిక్ష పడటం ఇదే మొదటిసారి.

Next Story