త్వరలోనే సీఎంకు లేఖ రాస్తా: బండి సంజయ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

మణిపూర్(Manipur ) సమగ్రాభివృద్ధి కోసం వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

త్వరలోనే సీఎంకు లేఖ రాస్తా: బండి సంజయ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్(Manipur ) సమగ్రాభివృద్ధి కోసం వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రవాణా, టూరిజం, విద్యుత్, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివ్రుద్ధి కోసం ప్రత్యేక ద్రుష్టి సారించాలని కోరారు. మణిపూర్ అల్లర్ల బాధితుల సహాయ పునరావాసం కోసం ఇప్పటికే కేంద్రం రూ.500 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మణిపూర్ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే నరేంద్రమోదీ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మణిపూర్ ప్రజలు హ్యాండ్లూం ఉత్పత్తులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న దృష్ట్యా ప్రతి రాష్ట్రంలో ‘మణిపూర్ మేళా’ పేరుతో స్థానిక ఉత్సత్తులను విక్రయించేలా కార్యాచరణ రూపొందంచాలని కోరారు. మణిపూర్ సాంస్కృతిక, వారసత్వ సంపద చాలా గొప్పదని, వాటని కాపాడుకుంటూ పర్యాటక అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు.

మూడు రోజుల మణిపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు రాష్ట్ర రాజధాని ఇంపాల్‌కు చేరుకున్నారు. స్థానిక ఎయిర్ పోర్టులో అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బండి సంజయ్ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై రెండు గంటలకుపైగా సమీక్షించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రవాణా, టూరిజం, విద్యుత్, హోం, వ్యవసాయం, అనుబంధ రంగాలపై 2 గంటలకుపైగా సమీక్ష జరిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ జనాభా 28 లక్షలు. రాష్ట్రంలోని 92 శాతం ప్రజలు కొండ ప్రాంతాల్లో (హిల్ స్టేషన్స్) లోనే నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అందుతున్న విద్య, వైద్యం, విద్యుత్, రవాణా సౌకర్యాలపై ఆరా తీశారు. వీటితోపాటు టూరిజం, హోం, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం కేంద్రం ఖర్చు చేస్తున్న నిధులు ఎంత మేరకు సక్రమంగా వినియోగం అవుతున్నాయనే అంశంపై చర్చించారు. మణిపూర్‌లో ప్రధానంగా ఉపాధి కొరత ఉందని, గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం లేదని, కొండ చరియలు విరిగిపడటంసహా ప్రకృతి విపత్తుల వల్ల నిత్యం రోడ్లు ధ్వంసమవుతున్నాయని వీటిపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులు కేంద్ర మంత్రికి విన్నవించారు. హ్యాండ్లూం ఉత్పత్తులకు కేంద్రమైన మణిపూర్‌లో టెక్స్ టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు ఏకో టూరిజంను అభివృద్ధి చేయాలని, ఇంపాల్- మయన్మార్ అంతర్జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని కోరారు. తద్వారా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, మణిపూర్ అభివృద్ధికి అవకాశాలున్నాయని తెలిపారు.

మణిపూర్‌కు విచ్చేసే పర్యాటకలకు సరైన హోటల్ వసతి లేదని, అవసరమైతే పర్యాటలకు స్థానికులే మెరుగైన భోజన, వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఇంపాల్‌కు రావడానికి విమాన ఛార్జీల భారం అధికంగా ఉందని తెలిపిన అధికారులు పౌరవిమానయాన శాఖతో మాట్లాడి చార్జీలు తగ్గించేలా చూడాలని కోరారు. రాష్ట్ర రాజధాని ఇంపాల్ ఎయిర్ పోర్టును ఆధునికరించేలా, కార్గో సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. విద్య, వైద్య సౌకర్యాలు గ్రామీణులకు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేవని, ముఖ్యంగా మణిపూర్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవల కొరత ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్యుల, స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు. దాదాపు 45 శాతం నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. విద్యకు సంబంధించి రాష్ట్రంలో 3 వేలకుపైగా స్కూళ్లలో 1 లక్షా 94 వేల 197 మంది చదువుకుంటున్నారని, పరీక్షల ద్వారా కాకుండా మెరిట్ ద్వారా మాత్రమే టీచర్ల నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో డ్రాపవుట్స్ సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో 5 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడ్డారని వారికి మార్కెటింగ్ సౌకర్యం లేదని, పండించిన పంట ఉత్పత్తులను స్థానిక సంతల్లోనూ విక్రయిస్తారని తెలిపారు. మణిపూర్ లో రైతులు పండించే బ్లాక్ రైస్‌కు మంచి డిమాండ్ ఉందని, తగిన మార్కెటింగ్ కల్పించాలని కోరారు.

మణిపూర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా గత రెండున్నరేళ్లుగా శాంతి భద్రతల సమస్య నెలకొందని, దీనివల్ల పర్యాటక రంగంసహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మణిపూర్ ప్రత్యేక పరిస్థితుల రీత్యా గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున సహాయ పునరావాస శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 262 శిబిరాల్లో 59 వేలకుపైగా బాధితులు తలదాచుకుంటున్నారని, వారికి భోజన వసతి సహా అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా బాధితుల ఖాతాల్లోనే నేరుగా నగదును జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్లర్లలో 7 వేల ఇండ్లు పూర్తిగా, 15 వేల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 వేల ఇండ్లను మంజూరు చేసిందని, ఒక్కో ఇంటికి రూ.3 లక్షల చొప్పున చెల్లిస్తోందని పేర్కొన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.75 వేల అందజేస్తున్నట్లు తెలిపారు. మణిపూర్2లో విద్యుత్ విషయానికొస్తే గత కొంత కాలంగా ప్రిపెయిడ్ మీటర్లను బిగించామని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలో 36 వేల అక్రమ కనెక్షన్లు ఉన్నాయని వివరించారు.

డాక్టర్ల, నర్సుల కొరతపై స్పందిస్తూ.. ఏ ఆసుపత్రిలో ఎంత మంది డాక్టర్ల, నర్సుల కొరత ఉందో ప్రతిపాదనలు పంపితే తగిన చర్యలు తీసుకునేందుకు యత్నిస్తానన్నారు. దేశంలోని ప్రఖ్యాత కార్పొరేట్ ఆసుపత్రులతో మాట్లాడి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ‘స్వదేశీ మేళా’ తరహాలో ఇకపై ప్రతి రాష్ట్రంలోనూ ‘మణిపూర్ మేళా’ను నిర్వహించి స్వరాష్ట్ర ఉత్పత్తులను విక్రయించాలని కోరారు. ఈ మేరకు తాను మణిపూర్ సీఎంకు సైతం త్వరలోనే లేఖ రాస్తానని చెప్పారు. మణిపూర్‌కు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఆయిల్ పాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పునరావాస బాధితులందరికీ వీలైనంత తొందర్లో వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రం ఇస్తున్న నిధులు వారి అభ్యున్నతికి ఖర్చు చేయాలని కోరారు. సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులు పంచాలన్నదే మోదీ లక్ష్యమైనందున సూర్యఘర్ పట్ల విస్త్రత అవగాహన కల్పించి సోలార్ యూనిట్లను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణ పెంపు కోసం కేంద్రం చేపట్టాల్సిన చర్యలపై వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి తనకు పంపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక అందిన వెంటనే కేంద్ర పెద్దలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అనురాగ్ బాజ్ పేయి, హోంశాఖ కమిషనర్ అశోక్ కమార్ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సచివాలయంలో సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లారు. మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి తొలిసారి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను గవర్నర్ అజయ్ భల్లా శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులతోపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

Next Story