- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బల్వంత్ రాయ్ మెహతా నుంచి అజిత్ పవార్ వరకూ.. విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతలు
గతంలో పలువురు సీఎంలు, రాజకీయ నేతలు కూడా తాము ప్రయాణిస్తున్న విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా దుర్మరణం చెందారు. వారిలో ఇద్దరు కీలక నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కూడా ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బారామతి వద్ద రన్ వే కు 100 అడుగుల దూరంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తోన్న ఛార్టెడ్ ఫ్లైట్ బుధవారం ఉదయం 8.46 గంటల సమయంలో కూలిపోయి.. పేలి భారీ మంటల్లో కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఫ్లైట్ లో ఉన్న ఐదుగురూ దుర్మరణం చెందారు. ప్రమాదస్థలంలో మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దల్లా మారడంతో అక్కడి వాతావరణం భయానకంగా ఉందని పలువురు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. అజిత్ పవార్ మరణం దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. ఇతర రాష్ట్రాల నేతలంతా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు మహారాష్ట్రకు వెళ్తున్నారు. కాగా.. గతంలో పలువురు సీఎంలు, రాజకీయ నేతలు కూడా తాము ప్రయాణిస్తున్న విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా దుర్మరణం చెందారు. వారిలో ఇద్దరు కీలక నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కూడా ఉన్నారు.
బల్వంత్ రాయ్ మెహతా
పాకిస్థాన్ యుద్ధ సమయంలో 1965 సెప్టెంబర్ 19న గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న డకోటా విమానం కచ్ ప్రాంతంలో కూలిపోయింది. విమానంపై దాడి జరగడంతో స్పాట్లోనే మెహతా మరణించారు. దేశంలో విమాన ప్రమాదంలో సీఎం హోదాలో మరణించిన తొలి వ్యక్తి బల్వంత్ రాయ్ మెహతా.
ఎస్ఎస్ ఖేరా
1968 జనవరి 23న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి ఎస్ఎస్ ఖేరా మరణించారు. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మోహన్ కుమారమంగళం
1973 మే 28న కేంద్ర ఇంధన శాఖ మంత్రి మోహన్ కుమారమంగళం కూడా విమానం కూలిపోవడంతో మృతి చెందారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ కూలిపోవడంతో.. ఆయనతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
మాధవరావు సింధియా
2001 సెప్టెంబర్ 30న మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావు సింధియా వ్యక్తిగత విమానం కూలిపోవడంతో మరణించారు. యూపీలోని మైన్పురి సమీపంలో సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
జీఎంసీ బాలయోగి
ఆ తర్వాత 2002 మార్చి 3వ తేదీన లోక్ సభ స్పీకర్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం చెందారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి
2009 సెప్టెంబర్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తుండగా.. నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించారు. 24 గంటల తర్వాత ఆయన మరణించిన అధికారులు ధృవీకరించారు.
డోర్జీ ఖాండు
2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండు ఇటానగర్ నుంచి తవాంగ్ కు హెలికాప్టర్ లో వెళ్తుండగా.. సాంకేతిక సమస్యలతో పర్వత ప్రాంతంలో అది కూలిపోయింది. సీఎం సహా హెలికాప్టర్లో ఉన్నవారంతా మృతి చెందారు.
అజిత్ పవార్
2026 జనవరి 28న బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి చార్టెడ్ విమానంలో వెళ్తున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. సాంకేతిక లోపం తలెత్తిన ఫ్లైట్ ను సేఫ్ గా ల్యాండ్ చేసే క్రమంలో లో విజిబులిటీ కారణంగా రాయిని ఢీ కొట్టడంతో ఫ్లైట్ బ్లాస్ట్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.






