బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..! స్పందించిన భారత్‌

by Ramesh Naini |

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..! స్పందించిన భారత్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అల్లరి మూకలు హిందువులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక దాడులకు పాల్పడుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ ఘటనలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అత్యంత ఆందోళనకరమని పేర్కొన్న కేంద్ర విదేశాంగ శాఖ, బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. అలాగే బంగ్లాదేశ్‌లో పారదర్శకంగా, న్యాయంగా ఎన్నికలు జరగాలని భారత్‌ కోరుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై 2,900 కి పైగా హింస సంఘటనలు నమోదు అయినట్లు తెలిపారు. అదేవిధంగా హెచ్‌-1బీ వీసాల అంశాన్నీ ప్రస్తావించిన జైస్వాల్‌, ఈ విషయంపై అమెరికాతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దీపూ చంద్రదాస్‌ అనే హిందూ యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేసి, అనంతరం చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిపై దాడి జరిగి మృతి చెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. రాజ్‌బరి జిల్లాలో బుధవారం రాత్రి అమృత్‌ అనే హిందూ యువకుడిని విచక్షణారహితంగా కొట్టి చంపినట్లు స్థానిక మీడియా ‘డెయిలీ స్టార్‌’ వెల్లడించింది. డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలతో గ్రామస్తులు అతనిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో అమృత్‌ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Next Story