- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏటీఎం క్యాష్ విత్ డ్రా కేసు : 9 ఏళ్ల తర్వాత రూ.3.28 లక్షల పరిహారం
ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా అవ్వకపోయినా అకౌంట్ నుంచి డెబిట్ అయిన కేసులో కీలక తీర్పు వెల్లడైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా అది విఫలమైంది. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా అవ్వకపోయినా తన అకౌంట్ నుంచి ఆ మొత్తం నగదు డెబిట్ అవ్వడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో 9 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. కోర్టు.. సదరు బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. అలాగే బాధితుడికి కోర్టు చెప్పిన మొత్తాన్నీ పరిహారంగా అందజేయాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్ లో 2017 ఫిబ్రవరి 18న జితేష్ కుమార్ గాంధీ అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం నుంచి రూ. 10,000 విత్ డ్రా చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఏటీఎం నుంచి నగదు కానీ, కనీసం ట్రాన్సాక్షన్ రిసీప్ట్ కానీ రాలేదు. ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఖాతా నుంచి మాత్రం రూ. 10,000 డెబిట్ అయ్యాయి. దీనిపై జితేష్ వెంటనే బ్యాంక్ ఆఫ్ బరోడా డుంభాల్ శాఖకు, ఎస్‌బీఐ ఉధ్నా శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ లావాదేవీ విజయవంతమైందని, నగదు అందినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకులు వాదించాయి.
కమిషన్ ఘాటు విమర్శలు..
ఈ వివాదంపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్, సదరు వినియోగదారుడికి నగదు అందినట్లు నిరూపించడంలో బ్యాంకులు విఫలమయ్యాయని స్పష్టం చేసింది. బ్యాంకుల మధ్య ఉండే అంతర్గత ఒప్పందాలతో కస్టమర్‌కు సంబంధం లేదని, వివాదాస్పద లావాదేవీల విషయంలో బ్యాంకులు పక్కా ఆధారాలను చూపాలని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా నగదును తిరిగి చెల్లించనందుకు బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. బాధితుడికి రూ.10,000 అసలు మొత్తాన్ని, 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. వీటితో పాటు కేసు ఆలస్యమైనందుకు గాను రూ.3.28 లక్షల భారీ పరిహారాన్ని, మానసిక వేదనకు రూ.3,000, న్యాయ పోరాట ఖర్చుల నిమిత్తం మరో రూ.2,000 చెల్లించాలని బ్యాంక్ ఆఫ్ బరోడాను ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం.. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే డెబిట్ అయిన నగదును నిర్ణీత గడువులోగా బాధిత వ్యక్తి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో మాత్రం బ్యాంకులు ఈ నియమాన్ని పాటించలేదని వినియోగదారుల కమిషన్ గుర్తించింది. ఈ తీర్పు బ్యాంకుల బాధ్యతారాహిత్యంపై సామాన్య వినియోగదారుడు సాధించిన గొప్ప విజయంగా నిలిచింది.






