- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగను పట్టుకునేందుకు తాంత్రికుడి వద్దకు.. కానిస్టేబుల్‌పై రాజస్థాన్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఓ చోరీ కేసును ఛేదించేందుకు తాంత్రికుడి ఆశ్రయించిన రాజస్థాన్ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక కాలంలో సీసీ టీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ టీమ్, డిజిటల్ వ్యవస్థలు అందుబాటులో ఉన్న ఓ పోలీసు చోరీ కేసును ఛేదించడానికి రాజస్థాన్ పోలీసులు ఏకంగా ఓ తాంత్రికుడిని ఆశ్రయించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ ఘటనపై తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ దర్యాప్తులు అనేవి శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా జరగాలి తప్ప, ఇలాంటి మూఢ నమ్మకాల ఆధారంగా కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
కట్ చేస్తే.. హెడ్ కానిస్టేబుల్ వద్దకు కేసు
నాగోర్ (Nagore) జిల్లాలోని శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్వాలియా గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ఖేమి దేవి (Khemi Devi) ఇంట్లో మార్చి 7న భారీ చోరీ జరిగింది. ఇంట్లో నుంచి దాదాపు రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు అపహరిచారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు బాధ్యతలను హెడ్ కానిస్టేబుల్ రతీరామ్ (Rathiram)కు అప్పగించారు. రోజులు గడుస్తున్నా చోరీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో దర్యాప్తు అధికారి రతీరామ్ ఓ వినూత్న మార్గం ఎంచుకున్నాడు. దొంగను పట్టుకోవడానికి అల్వార్ జిల్లాలో ఉన్న ఓ తాంత్రికుడి వద్దకు బాధితులను, గ్రామ పెద్దలను తీసుకెళ్లాడు. అక్కడ ఆ తాంత్రికుడు మంత్రించి.. బాధితురాలి కోడలి తండ్రి అయిన మోహన్ రామ్ (Mohanram) అనే వ్యక్తి ఆ దొంగతనం చేశాడని చెప్పేశాడు. దీంతో పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తాంత్రికుడి మాటలు నమ్మి, ఆ వృద్ధుడిని దొంగగా చిత్రీకరిస్తూ వెంటబడ్డారు.
ఓవర్ టు హైకోర్టు..
పోలీసులు తాంత్రికుడి మాటలు పట్టుకుని తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఖేమి దేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ (Munnuri Lakshman) నేతృత్వంలోని సింగిల్ బెంచ్ (Single Bench) పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారి రతీరామ్ అల్వార్‌లోని తాంత్రికుడి నివాసానికి వెళ్లినట్లుగా అంగీకరించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ క్రిమినల్ కేసు దర్యాప్తు తాంత్రికుడి ఆదేశాలకో, అభిప్రాయాలకో అనుగుణంగా సాగకూడదని తెలిపింది. నిజమైన నిందితులను పట్టుకోవడానికి నిష్పక్షపాతమైన విచారణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత దర్యాప్తు అధికారి రతీరామ్‌ను కేసు నుంచి తక్షణమే తొలగించాలని నాగోర్ ఎస్పీ (SP)ని ఆదేశించింది. రాబోయే 15 రోజుల్లోగా ఈ కేసును వేరే పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), అంతకంటే ఉన్నత స్థాయి అధికారికి కేసు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.






