మరో ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్! ఎన్నికలు ముగియగానే భారత్‍లో పెట్రోల్ ధరల పెంపు?

by Prasad Jukanti |   (  Updated:2026-04-23 06:20:17  IST  )

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో త్వరలో భారత్ లోనూ భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరో ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్! ఎన్నికలు ముగియగానే  భారత్‍లో పెట్రోల్ ధరల పెంపు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభానికి గురి చేస్తోంది. ఇరు పక్షాల మధ్య సీజ్ ఫైర్ అంశంపై శాంతి చర్చలు ఇంకా ప్రయత్నాల దశలోనే ఉన్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిణామాలతో ఈ జలమార్గం అందుబాటులోకి వస్తుందని తద్వారా తమకు ఇంధన కష్టాలు తప్పుతాయని ప్రపంచ దేశాలు భావించినా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మార్గం పూర్తిగా తెరిచేందుకు మరో ఆరు నెలలైనా పట్టే అవకాశం ఉందని తాజాగా అమెరికా అంచనా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల సెగలు కక్కే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సవాలుగా సీమైన్స్ గుర్తింపు:

తాజాగా పెంటగాన్, అమెరికా చట్టసభ సభ్యుల మధ్య సీక్రెట్ సమావేశం జరిగిందని ఈ సమావేశంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హర్మూజ్ మార్గంపై కీలక నివేదిక చట్టసభ సభ్యులకు వివరించినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ సైన్యం ఈ హర్మూజ్ జలసంధిలో అమర్చిన సీ మైన్స్ కారణంగానే ఈ మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పట్టనుందనని, హర్మూజ్ తో పాటు దాని చుట్టుపక్కల 20 కంటే ఎక్కువ మైన్స్ ఇరాన్ అమర్చి ఉండవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది. వీటిని GPS సాంకేతికతను ఉపయోగించి రిమోట్‌గా అమర్చడం వల్ల ఇప్పుడు గుర్తించడం తలనొప్పిగా మారిందని, వాటిని పూర్తిగా తొలగించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఈ కథనాలు పేర్కొన్నాయి. ఇక ఇరాన్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించగా, ఇరాన్ స్వయంగా అమర్చిన గనులనే తాము మళ్లీ వెతుక్కోలేక ఇబ్బందిపడుతోందని 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదించింది. అయితే యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చినట్లుగా చెప్పబడుతున్న నివేదికపై పెంటగాన్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఎన్నికల తర్వాత భారత్‍లో భారీగా పెట్రో వడ్డన?

ఈ సముద్ర మార్గం వివాదం ఇప్పటికే ఆర్థిక మార్కెట్లను వణికిస్తుండగా మరో ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాదనే ప్రచారం అంతర్జాతీయ మార్కెట్లను మరింత టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరల విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్‍లో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‍లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఈ వడ్డన ఖాయం అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత క్రూడాయిల్ ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు పెట్రోల్ లీటర్ పై రూ.25 నుంచి రూ. 28 వరకు ఉండొచ్చని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే వాహనదారుల జేబులకు చిల్లుతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వాహనదారులకు నేరుగా ప్రయోజనం చేకూరకపోయినా ఇంధన సంస్థలపై భారం తగ్గించగలిగింది. తద్వారా ఇంధన ధరలు ఇప్పటి వరకు స్థిరంగానే కొనసాగుతున్నాయి. కానీ హర్మూజ్ వద్ద పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యాక వడ్డన ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మరి కేంద్రం ఎలాంటి ఆలోచనతో ఉందనేది త్వరలోనే తేలనుంది.

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన

Next Story