ఇండియా కూటమికి మరో షాక్: కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!

by Dishanational2 |
ఇండియా కూటమికి మరో షాక్: కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు ఆ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని వెల్లడించారు. బుధవారం ఆమె శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీడీపీకి ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. సీట్ షేరింగ్ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)నాయకుడు ఒమర్ అబ్దుల్లా సహకరించడం లేదని ఆరోపించారు. ఎన్సీ వ్యవహరించిన తీరు బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఇండియా కూటమికి పెద్ద షాక్ తగిలినట్టు అయింది. కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపుతామని ఎన్సీ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, మొహబూబా ముఫ్తీ నిర్ణయంపై ఎన్సీ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా స్పందించారు.‘ ముఫ్తీ మొత్తం 5 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ప్రకటించినట్లయితే అది ఆమె ఇష్టం. ఫార్ములా ఆధారంగానే కశ్మీర్‌లో 3 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఫ్తీ ఎలాంటి పొత్తును కోరుకోకపోవచ్చు. పీడీపీ కోసం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతాం’ అని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed