- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఎంసీకి మరో షాక్: రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న మెస్సీ టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, గతేడాది కోల్‌కతాలో జరిగిన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన నిర్వాహకుడు, ప్రముఖ క్రీడా ప్రమోటర్ శతద్రు దత్తా.. టీఎంసీపై ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా మాజీ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ దౌర్జన్యం వల్లే తన ప్రతిష్ట దెబ్బతిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
స్టేడియంలో తీవ్ర గందరగోళం
గతేడాది డిసెంబర్ 13న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ కార్యక్రమం ఏర్పాటైంది. అయితే, అప్పటి మంత్రి అరూప్ బిశ్వాస్ తన అధికార బలంతో తన అనుచరులను, రిజిస్టర్ కాని వ్యక్తులను గ్రౌండ్‌లోకి పంపడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారు మెస్సీ చుట్టూ చేరి హంగామా చేయడంతో అసహనానికి గురైన మెస్సీ (తన సహచరులు సువారెజ్, డి పాల్‌తో కలిసి).. గంటసేపు జరగాల్సిన కార్యక్రమం నుంచి కేవలం 25 నిమిషాల్లోనే వెనుదిరిగారు. దీంతో ఖరీదైన టికెట్లు కొనుక్కున్న అభిమానులు నిరాశతో కోపోద్రిక్తులై స్టేడియంలో ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
బలిపశువునయ్యా.. 38 రోజులు జైలులో!
ఈ ఘటనకు నిర్వాహకుడిదే బాధ్యత అంటూ పోలీసులు శతద్రు దత్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆయన సుమారు 38 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, జనవరిలో బెయిల్‌పై విడుదలయ్యారు. అరూప్ బిశ్వాస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తనను బలిపశువును చేశారని దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దౌర్జన్యం వల్లే ఇదంతా జరిగిందని, పోలీసులు అప్పట్లో మూగ ప్రేక్షకుల్లా మిగిలిపోయారని ఆయన విమర్శించారు.
ఇక నా వంతు వచ్చింది..
ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోవడం, అరూప్ బిశ్వాస్ కూడా తన సీటును కోల్పోవడంతో శతద్రు దత్తా మౌనం వీడారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మీకు శిక్ష పడిందని అనుకోవద్దు. నా మూడేళ్ల కష్టాన్ని, నా ప్రతిష్టను మంటగలిపినందుకు మీపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నాను. అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్తాను’ అని హెచ్చరించారు. ‘నా కార్యక్రమాన్ని నాశనం చేశారు. నన్ను 38 రోజులు జైలుకు పంపారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలన్నీ బయటపెడతా’ అని దత్తా సవాల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం బెంగాల్ రాజకీయాల్లో, క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






