ఢిల్లీలో కాంగ్రెస్‌కు మరో షాక్: ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇద్దరు కీలక నేతల రాజీనామా

by Dishanational2 |
ఢిల్లీలో కాంగ్రెస్‌కు మరో షాక్: ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇద్దరు కీలక నేతల రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్‌లు పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు వీరిద్దరూ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆప్‌తో పొత్తు పెట్టుకోవడమే తమ రాజీనామాకు కారణమని వారు పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

‘ఆప్ కార్యకర్తలు గత ఏడేళ్లుగా అనేక మోసాలకు పాల్పడ్డారు. కాబట్టి అటువంటి పార్టీతో జతకట్టినందుకు ఎంతో భాధపడుతున్నాం. ఈ పరిణామం వల్ల ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యకర్తలకు రోజు రోజుకూ చెడ్డపేరు వస్తోంది. ఎక్కడికి వెళ్లినా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కాబట్టి ఆత్మ గౌరవం ఉన్న నాయకుడిగా పార్టీ నుంచి వైదొలగుతున్నా. ఇకపై పార్టీకి నాకు ఏ సంబంధమూ లేదు. పార్టీ పదవులకు, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. గత 30 ఏళ్లలో నాలాంటి సామాన్యుడికి ఎన్నో అవకాశాలు కల్పించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’ అని ఖర్గేకు రాసిన లేఖలో నీరజ్ బసోయా పేర్కొన్నారు. కాగా, బసోయా ప్రస్తుతం పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా ఉన్నారు.

అలాగే మరో మాజీ ఎమ్మెల్యే నసీబ్ సింగ్ ఢిల్లీలో కాంగ్రెస్ ధ్వంద వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ‘దేవేందర్ యాదవ్‌ను కాంగ్రెస్ అధిష్టానం డీపీసీసీ చీఫ్‌గా నియమించింది. ఆయన ప్రస్తుతం పంజాబ్‌లో ఏఐసీసీ ఇన్ చార్జిగానూ ఉన్నారు. పంజాబ్‌లో కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ..ఢిల్లీలో ప్రశంసిస్తున్నాడు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్, కాంగ్రెస్‌లు పంజాబ్‌లో వేర్వేరుగా బరిలోకి దిగుతుండగా..ఢిల్లీలో మాత్రం పొత్తు పెట్టుకున్నాయి.

Next Story

Most Viewed