తమిళనాడులో పొలిటికల్ క్లైమాక్స్: విజయ్ చేజారిన మ్యాజిక్ ఫిగర్.. సీన్‌లోకి పళనిస్వామి ఎంట్రీ!

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-08 16:49:36  IST  )

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారాయి. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న నటుడు విజయ్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి.

తమిళనాడులో పొలిటికల్ క్లైమాక్స్: విజయ్ చేజారిన మ్యాజిక్ ఫిగర్.. సీన్‌లోకి పళనిస్వామి ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారాయి. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న నటుడు విజయ్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 'మ్యాజిక్ ఫిగర్' కోసం కసరత్తు జరుగుతున్న వేళ, ప్రత్యర్థి వర్గాలు ఒక్కటవ్వడం, మిత్రపక్షాలు దూరమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తుందనుకున్న ఐయూఎంఎల్ (IUML) పార్టీ, అనూహ్యంగా విజయ్‌కు షాకిచ్చింది. టీవీకే (TVK) పార్టీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో విజయ్ సంఖ్యాబలం మరింత క్షీణించింది. మ్యాజిక్ ఫిగర్ (118)కు చేరువలో ఉన్న విజయ్, ఇప్పుడు ఆ మైలురాయికి మరింత దూరమయ్యారు.

సీన్‌లోకి పళనిస్వామి.. దినకరణ్ మాస్టర్ స్ట్రోక్!

ఈ రాజకీయ సంక్షోభాన్ని అదునుగా చేసుకుని అన్నాడీఎంకే పావులు కదిపింది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, AMMK పార్టీ నేత టీటీవీ దినకరణ్ గవర్నర్‌ను కోరారు. పాత వైరాన్ని పక్కన పెట్టి దినకరణ్ మద్దతు తెలపడం విజయ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, టీవీకేకు మద్దతు ఇస్తాయని భావించిన వీసీకే (VCK) ఎమ్మెల్యేలు తాజాగా మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్‌కు మద్దతు లేఖలు ఇవ్వకుండా స్టాలిన్ దగ్గరకు వీసీకే నేతలు వెళ్లడం వెనుక ఏదైనా కొత్త వ్యూహం ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. డీఎంకే మళ్ళీ చక్రం తిప్పబోతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

గవర్నర్ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ..

క్షణం క్షణం ఉత్కంఠగా మారుతున్న ఈ పరిస్థితుల్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్‌కు మెజారిటీ నిరూపించుకోవడానికి సమయం ఇస్తారా?, లేక అన్నాడీఎంకే కూటమిని ఆహ్వానిస్తారా?, ఎవరూ మెజారిటీ చూపని పక్షంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా?, మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఊహకందని మలుపులతో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Next Story