ఉత్తరాఖండ్ కు మరో భారీ హెచ్చరిక.. 11 జిల్లాలకు క్లౌడ్ బరస్ట్ ముప్పు

by Muthe.Rajitha |

క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడుతూ ఉత్తరాఖండ్ అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది.

ఉత్తరాఖండ్ కు మరో భారీ హెచ్చరిక.. 11 జిల్లాలకు క్లౌడ్ బరస్ట్ ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడుతూ ఉత్తరాఖండ్ అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది. తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ కు భారీ హెచ్చరిక జారీ చేసింది భారత వాతావరణ శాఖ (IMD). ఏకంగా 11 జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. చమోలీ, హరిద్వార్, నైనిటాల్, ఉద్దమ్ సింగ్ నగర్ సహా 11 జిల్లాల్లో ఆగస్టు 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చమోలీకి రెడ్ అలర్ట్, హరిద్వార్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాటితోపాటు డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, తెహ్రీ, పౌరీ, అల్మోరా, బాగేశ్వర్, చంపావత్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలను ముందస్తు జాగ్రత్తగా మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరకాశీలోని ధరాలీ, హర్సిల్, సుఖీ గ్రామాల్లో మంగళవారం సంభవించిన క్లౌడ్‌బరస్ట్‌ల కారణంగా ఆకస్మిక వరదలు, భారీ బురద, రాళ్లు జారిపడి ఐదుగురు మరణించారు. 11 మంది సైనికులు గల్లంతయ్యారు. ఆయా గ్రామాలకు చెందిన మరో 50 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. NDRF, SDRF, ITBP, ఆర్మీ బృందాలు 190 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

13 మంది సైనికులను రక్షించాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకొని, బుధవారం హెలికాప్టర్‌లో బాధిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం ధామీతో మాట్లాడి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అలకనంద, గోమతి, సరయు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

Next Story