రాష్ట్రంలో మరో విషాదం.. ‘పద్మశ్రీ’ గ్రహీత అనుమానాస్పద మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 04:07:00  IST  )

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (Subbanna Ayyappan) (70) కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని సాయి ఆశ్రమం సమీపంలో కావేరి నది (Kaveri River)లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు.

రాష్ట్రంలో మరో విషాదం.. ‘పద్మశ్రీ’ గ్రహీత అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (Subbanna Ayyappan) (70) కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని సాయి ఆశ్రమం సమీపంలో కావేరి నది (Kaveri River)లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. మైసూరు (Mysore)లోని విశ్వేశ్వర నగర్ పారిశ్రామిక ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్న అయ్యప్పన్, ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజులైనా ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలు సుబ్బన్న అయ్యప్పన్ ఆచూకీ కనిపెట్టేందుకు రంగంలోకి దిగాయి. అయితే, కావేరి నదిలో ఓ మృతదేహం కనిపించిందని స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని వెలికి తీయగా.. అది సుబ్బన్న అయ్యప్పన్‌దిగా గుర్తించారు. అదేవిధంగా అయ్యప్పన్ స్కూటర్ కూడా నది ఒడ్డున కనిపించిందని అని మండ్య పోలీసులు (Mandya Police) సోమవారం వెల్లడించారు.

కాగా, డాక్టర్ అయ్యప్పన్ భారతదేశంలో ‘నీలి విప్లవానికి’ మార్గదర్శకుడు, ఆక్వాకల్చర్, ఫిషరీస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)కు 2010 నుంచి 2016 వరకు డైరెక్టర్ జనరల్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (DARE) సెక్రటరీగా, ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ చాన్సలర్‌గా ఉన్నారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1955 డిసెంబర్ 10న చామరాజనగర్ జిల్లాలోని యలందూర్‌లో జన్మించిన ఆయన, మంగళూరు నుంచి ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ, బెంగళూరు యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ నుంచి పీహెచ్‌డీ పొందారు. 2022లో పద్మశ్రీ (Padma Sri), 2013లో కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారంతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. అయితే, సుబ్బన్న అయ్యప్పన్‌ది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన సాయి ఆశ్రమం సమీపంలోని కావేరీ నది ఒడ్డున ధ్యానం కోసం తరచూ వెళ్లేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. డాక్టర్ అయ్యప్పన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Next Story