Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ రేసుకు అన్నామలై దూరం..!

by Shamantha N |

“మా పార్టీలో నేతలు నాయకత్వం కోసం పోటీ పడరు” అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ రేసుకు అన్నామలై దూరం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: “మా పార్టీలో నేతలు నాయకత్వం కోసం పోటీ పడరు” అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష రేసులో లేనన్నారు. కోయంబత్తూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీజేపీలో నాయకత్వం కోసం నేతలు పోటీ పడరు. మేమంతా ఏకగ్రీవంగా అధ్యక్షుడ్ని ఎన్నుకుంటాం. కానీ, నేను కూడా ఈ రేసులో లేను’’ అని అన్నారు. పార్టీకి ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పార్టీ ప్రగతి కోసం ఎంతో మంది తమ ప్రాణాలర్పించారని అన్నారు. ఎప్పటికీ పార్టీ బాగుండాలని పరితపించే వ్యక్తిని తానని చెప్పుకొచ్చారు. తదుపరి అధ్యక్షుడు ఎవరనే రాజకీయ ఊహాగానాలపైనా ఆయన స్పందించలేదు. ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం 50 మంది నేతలు నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

అన్నాడీఎంకేతో పొత్తు..

2023లో జయలలిత, సీఎన్ అన్నాదురైలపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, 2023లో ద్రవిడ పార్టీతో బీజేపీకి పొత్తు కుదరలేదు. ఫలితంగా ఈ రెండు పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. తమిళనాడులో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయినప్పటికీ.. ఓటు బ్యాంకులో గణనీయమైన పెరుగుదల కన్పించింది. నిరంతరం సమస్యలను లేవెనత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అన్నామలై కృషి చేశారు. మరోవైపు, అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు గురించి వార్తలు వచ్చాయి. అయితే, దాని గురించిన వివరాలపై అన్నామలై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. " దీనిపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. దయచేసి ఈ విషయంపై ఆయన స్పందనను తుది మాటగా తీసుకోండి" అని అన్నారు. కాగా.. ఈ టైంలో బీజేపీ చీఫ్ ఎంపిక ఉత్కంఠగా మారింది. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ పశ్చిమ తమిళనాడుకు చెందిన గౌండర్ వర్గానికి చెందినవారు. దీంతో, ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ చీఫ్ గా నియమించడంతో ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని కాషాయ పార్టీ యోచ్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అన్నామలై ఈ నెల 7న ఢిల్లీకి వెళ్తారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఈ నెల 9న ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్న వేళ అన్నామలై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story