కేరళ ఆలయాల అభివృద్ధికి భారీ విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ

by Naga Rani Yarlagadda |

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కేరళలో ఆలయాల అభివృద్ధికి భారీ విరాళం ప్రకటించారు.

కేరళ ఆలయాల అభివృద్ధికి భారీ విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన కేరళ పర్యటనలో ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి మరియు గజరాజుల సంరక్షణ కోసం ఏకంగా రూ.18 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సోమవారం ఆయన కేరళలోని అత్యంత ప్రసిద్ధ రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా రాజరాజేశ్వరం, గురువాయూర్ దేవాలయాలకు చెరో రూ.3 కోట్లు విరాళంగా అందజేశారు. వీటితో పాటు, రాజరాజేశ్వరం ఆలయంలో సుమారు రెండు శతాబ్దాల కాలంగా శిథిలావస్థకు చేరిన పురాతన తూర్పు గోపురం పునర్నిర్మాణం కోసం అదనంగా రూ.12 కోట్లు కేటాయించారు. ఆలయ అధికారులు అనంత్ అంబానీకి ఘనస్వాగతం పలికి సత్కరించగా, ఆయన రూ.3 కోట్ల చెక్కును దేవస్వం బోర్డు ప్రతినిధులకు అందజేశారు.

'వంతార' ద్వారా ఏనుగుల సంరక్షణ

ఆధ్యాత్మిక సేవలతో పాటు జంతు సంరక్షణపై కూడా అనంత్ తన మక్కువను చాటుకున్నారు. గురువాయూర్ ఆలయానికి చెందిన ఏనుగుల కోసం తన 'వంతారా' ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఏనుగుల కోసం అత్యాధునిక వైద్యశాల, గొలుసులు లేని స్వేచ్ఛాయుత ఆశ్రయాలను (Chain-free shelters) నిర్మించనున్నట్లు వెల్లడించారు. శాస్త్రీయ పద్ధతుల్లో గజరాజుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

"భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కావు. అవి కరుణ, ప్రకృతి, సమాజం మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకలు. మన పవిత్ర వారసత్వాన్ని భావి తరాల కోసం భద్రపరచడం మనందరి కర్తవ్యం. భక్తుల సౌకర్యాలతో పాటు మూగజీవాలకు గౌరవప్రదమైన సంరక్షణ అందించాలని మేము ఆశిస్తున్నాము" అని అనంత్ అంబానీ వ్యాఖ్యానించారు.

Next Story