- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bharat Taxi: ఓలా, ఉబర్‌లకు దీటుగా 'భారత్ ట్యాక్సీ'.. లాంఛ్ చేసిన అమిత్ షా
దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. విదేశీ పెట్టుబడులతో నడిచే ప్రైవేట్ సంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ, దేశంలోనే తొలిసారిగా సహకార రంగం (Cooperative Sector) ఆధ్వర్యంలో నడిచే 'భారత్ ట్యాక్సీ' (Bharat Taxi) ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. విదేశీ పెట్టుబడులతో నడిచే ప్రైవేట్ సంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ, దేశంలోనే తొలిసారిగా సహకార రంగం (Cooperative Sector) ఆధ్వర్యంలో నడిచే 'భారత్ ట్యాక్సీ' (Bharat Taxi) ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రెండు నెలల విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్ అనంతరం, ప్రస్తుతం ఈ సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR), గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చారు. రానున్న రెండేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తామని అమిత్ షా ప్రకటించారు. ‘మూడేళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.
డ్రైవర్లకే లాభాలు - జీరో కమిషన్..
ప్రస్తుతం ఈ రంగంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలదే హవా నడుస్తోంది. అయితే భారత్ ట్యాక్సీ పూర్తిగా 'జీరో కమిషన్', 'సర్జ్-ఫ్రీ' (ధరల పెంపు లేని) విధానంతో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో వచ్చే లాభాలను నేరుగా డ్రైవర్లకే పంచుతామని, ఇది పూర్తిగా డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే సంస్థ అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రమాద బీమా.. సామాజిక భద్రత
ఈ ప్లాట్‌ఫామ్‌లో డ్రైవర్లను 'సారథులు'గా వ్యవహరిస్తారు. వారికి కేవలం ఆదాయమే కాకుండా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి సామాజిక భద్రతను కూడా కల్పిస్తున్నారు. ఎనిమిది ప్రముఖ సహకార సంస్థల మద్దతుతో, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీల చట్టం-2002 కింద ఈ సంస్థను ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్ట్ సమయంలోనే 3 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఇందులో చేరగా, లక్ష మందికి పైగా వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, గుజరాత్‌లలో ఇప్పటికే రోజుకు 10 వేలకు పైగా రైడ్లు నడుస్తున్నాయని, ఇప్పటి వరకు రూ.10 కోట్లను నేరుగా డ్రైవర్లకు పంపిణీ చేశామని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా కార్లు, ఆటోలు, టూ-వీలర్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది.






