- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aviation: పశ్చిమాసియా యుద్ధం వల్ల 5,500కి పైగా విమానాల రద్దు
ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విమానయాన అధికారులు, విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత విమానయాన రంగం తీవ్ర అంతరాయాలను ఎదుర్కొందని ప్రభుత్వం తెలిపింది. భారతీయ, విదేశీ విమానయాన సంస్థలు 5,500కి పైగా విమానాలను రద్దు చేశాయని ప్రభుత్వం సోమవారం లోక్‌సభకు తెలియజేసింది. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు గగనతల పరిమితులు, కార్యాకలాపాలకు భంగం కలిగించడంతో దేశీయ విమానయాన సంస్థలు 4,335 ఫ్లైట్లను, విదేశీ ఎయిర్‌లైన్స్ 1,187 వరకు సేవలను రద్దు చేశాయని చెప్పారు. ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విమానయాన అధికారులు, విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి. డీజీసీఐ, విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోందన్నారు.
ఛార్జీలపై పర్యవేక్షణ
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను, భారత్‌తో ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విమాన ప్రయాణంపై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్ రూట్ మార్పులు, రీషెడ్యూలింగ్ సహా అవసరమైన సర్దుబాట్లు జరుగుతున్నాయి. ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, సాధ్యమైన చోట సజావుగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో, విమాన ఛార్జీల విషయంలో, ప్రతికూల సమయంలో అనవసరమైన పెరుగుదల లేకుండా చూసుకోవడానికి అధికారులు టిక్కెట్ ధరలను నిశితంగా గమనిస్తున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.






