సెన్సెస్ నిర్వహణలో జాప్యం.. పెండింగ్‌లో కీలక నివేదికలు

by John Kora |
సెన్సెస్ నిర్వహణలో జాప్యం.. పెండింగ్‌లో కీలక నివేదికలు
X

- ఐదేళ్లుగా రెండు నివేదికలు పెండింగ్

- జనాభా లెక్కలే వాటికి ఆధారం

- ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం

- విద్యా సంబంధిత కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణకు అడ్డంకి

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ప్రతీ పదేళ్లకు ఒక సారి నిర్వహించే జనాభా లెక్కల (సెన్సెస్) కార్యక్రమం నాలుగేళ్లుగా పెండింగ్ ఉంది. 2021లో నిర్వహించాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత పలు కారణాలు చూపుతూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంత వరకు సెన్సెస్ నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా జనాభా లెక్కలు తీసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జనగణన కోసం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వం ఈ ఏడాది కూడా సెన్సెస్ నిర్వహించబోదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు కీలకమైన నివేదికలు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పౌర నమోదు వ్యవస్థ ఆధారంగా తీసే భారతదేశ ముఖ్యమైనం గణాంకాలు, మరణాలకు కారణమయ్యే వైద్య ధృవీకరణ నివేదకలు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు నివేదికలను చివరి సారిగా 2020లో విడుదల చేశారు. ఇక ఏటా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసే 'క్రైమ్ రిపోర్టు'ను 2023 నుంచి విడుదల చేయలేదు.

జనాభా లెక్కల ఆధారంగా కొన్ని ముఖ్యమైన గణాంకాలు చేస్తారు. వీటిలో జనన మరణాలతో పాటు మృత జననాల వంటి ముఖ్యమైన గణాంకాలు నమోదు చేయాల్సి ఉంది. వీటి ఆధారంగానే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, మాతా శిశు ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను రూపొందించి, పర్యవేక్షిస్తుంటారు. ఆయా రాష్ట్రాలు ఈ అంశాలపై గణాంకాలను నమోదు చేసి భారత రిజిస్ట్రార్ జనరల్‌కు పంపుతాయి. కేంద్ర ప్రభుత్వం 2023లో జనన, మరణాల నమోదు చట్టానికి సవరణ చేసి అమలు చేస్తోంది. దీని ప్రకారం 2023 అక్టోబర్ 1 తర్వాత జరిగే అన్ని జననాలు,మరణాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ పోర్టల్ ద్వారా డిజిటల్‌గా నమోదు చేశాలి. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం రియల్-టైమ్ డేటాను పొందే వీలుంటుంది. అయితే ఇప్పటి వరకు హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, చండీఘర్, మిజోరాం, గోవా, అరుణాచల్ ప్రదేశ్‌లు మాత్రమే 2022 వరకు ఈ నివేదికలను విడుదల చేశాయి. కేరళ చివరి సారిగా 2021లో ప్రచురించగా.. 2023 వరకు నివేదిక ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరాం మాత్రమే.

2020-21లో నిర్వహించాల్సిన సెన్సెస్ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. అయితే పలు రాజకీయ పార్టీలో జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సెన్సెస్‌కు తాత్కాలిక విరామం తప్పలేదు. కుల గణన నిర్వహించడానికి అనువైన మార్గాలను కొన్నినెలలుగా అన్వేషిస్తున్నప్పటికీ.. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికీ తుది నిర్ణయానికి రాలేదు. 2011లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కులగణనను నిర్వహించింది. కానీ ఆ ఫలితాలను ప్రకటించలేదు. 2021లో ఆ గణన తప్పుల తడకగా ఉందని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. కాగా, ఇక ఈ ఏడాది జనాభా లెక్కలు నిర్వహించాలంటే.. నిరుడు నవంబర్‌లోనే నోటిఫికేషన్ జారీ చేసి ఉండాలి. రెండు దశల్లో జనాభా లెక్కలు తీయడానికి కనీసం 10 నెలల సమయం పడుతుంది. అయితే ఈ సారి డిజిటల్ పద్దతిలో జనగణన నిర్వహించాలని భావిస్తుండటంతో ఇందుక 30 లక్షల మందికి పైగా ఎన్యుమరేటర్లకు శిక్సణ ఇవ్వాల్సి ఉంది. ఇందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే దేశంలో 24 లక్షల సెన్సెస్ బ్లాక్స్‌ను ఖరారు చేశారు. 2019లోనే ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. కాబట్టి మరోసారి శిక్షణకు ఎక్కువ సమయం పట్టదని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్న సెన్సెస్ డేటా 13 ఏళ్ల నాటిది. అయితే జనాభా కూర్పును అర్థం చేసుకోవడానికి, పని చేసే వయస్సు వర్గాలను గుర్తిచడానికి, గృహ వ్యయం, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా, జనన మరణాల పారామీటర్స్ అర్థం చేసుకోవడానికి తాజా జనాభా లెక్కలు చాలా అవసరం. అంతేకాకుండా రిజర్వేషన్ల అమలుకు కుల గణన కూడా ముఖ్యమే. అయినా సరే కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ విషయంలో సీరియస్‌గా లేకపోవడంపై ప్రతిపక్షాలు గగ్గొలో పెడుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా లెక్కలు లేట్ కావడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. మరి కేంద్ర ప్రభుత్వం సెన్సెస్‌ను ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాలి.

Advertisement
Next Story