ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా.. ఇరాన్‌పై అమెరికా భారీ దాడి

by Gantepaka Srikanth |

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి.

ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా.. ఇరాన్‌పై అమెరికా భారీ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్‌లోని వ్యూహాత్మక నగరం ఇస్ఫహాన్ (Isfahan) లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీ వైమానిక దాడులు(900-kg Bunker Buster Bomb) జరిపాయి. ఈ దాడుల వల్ల ఇస్ఫహాన్ నగరంలో వరుసగా భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ అణు కేంద్రాలు, ప్రధాన సైనిక స్థావరాలు ఉన్న ఇస్ఫహాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో వెనకడుగు వేయదని ఈ చర్య ద్వారా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన వైమానిక శక్తిని ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గతంలో ఇరాన్ చేసిన దాడులకు ప్రతిచర్యగానే ఈ దాడిని భావిస్తున్నారు.

ఇరాన్ స్పందన..

దాడుల తీవ్రతపై ఇరాన్ అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, తమ గగనతలంపైకి వచ్చిన డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ దాడులతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందన్న భయంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. శాంతి చర్చల ప్రతిపాదనలు ఒకవైపు సాగుతుండగానే, మరోవైపు ఈ స్థాయి దాడులు జరగడం పశ్చిమ ఆసియాలో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో తెలియజేస్తోంది. ఈ దాడుల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story