- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ విద్యార్థులకు అమెరికా కీలక హెచ్చరిక.. గైర్హాజరుకు వీసా రద్దు!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో విదేశీయుల పట్ల కఠిన వైఖరి కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తన సంచలన నిర్ణయాలతో విదేశీయుల పట్ల కఠిన వైఖరి కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్రమ వలసదారులను బలవంతంగా వారి దేశాలకు పంపించేస్తూనే.. వీసా విషయాల్లో కూడా అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలతో చాలామంది విద్యార్థుల వీసాలను (US Visa) రద్దు చేస్తూ, దేశం నుంచి వెళ్లగొట్టిన ఉదంతాలు జరిగిన నేపథ్యంలో.. తాజాగా ట్రంప్ సర్కార్ మరో బాంబ్ వేసింది. అమెరికాలో ఉన్న భారత సహా ఇతర దేశాల విద్యార్థులకు, వారి హాజరు ఆధారంగా కూడా వీసాలు రద్దు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అంటే.. విద్యార్థి వీసాపై యూఎస్ వెళ్లి విద్యార్థులు విద్యా సంస్థల అనుమతి లేకుండా తరగతులకు సరిగ్గా హాజరు కాకపోయినా, చదువు మానేసినా వారి వీసాలను రద్దు చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'డ్రాపౌట్ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా.. మీ విద్యార్థి వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి' అని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.






