America: అమెరికాలో మరోసారి భారీ నిరసనలు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు మరోసారి భారీగా నిరసనలు తెలిపారు.

America: అమెరికాలో మరోసారి భారీ నిరసనలు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు మరోసారి భారీగా నిరసనలు తెలిపారు. న్యూయార్క్ (New York) , వాషింగ్టన్ (Washington), చికాగో, లాస్ ఎంజిల్స్ సహా పలు నగరాల్లో వేలాది మంది ఆందోళన కారులు వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ ఎదుట కూడా ఆందోళనలు నిర్వహించారు. ట్రంప్ నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ పౌర హక్కులు, చట్ట నియమాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సుంకాలు, ఉద్యోగాల తొలగింపుల వంటి నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి ‘50501‘ అని పేరు పెట్టారు. అంటే 50 నిరసనలు, 50 రాష్ట్రాలు, 1 ఉద్యమం అని పిలుపునిచ్చారు.

‘అమెరికాలో రాజులు లేరు’

నిరసనల్లో భాగంగా ప్రజలు వివిధ రకాల నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ‘అమెరికాలో రాజులు లేరు’, ‘ఫ్యూడల్ యుగం ముగిసింది’, అని బోర్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. అంతేగాక గత నెలలో అరెస్టైన పాలస్తీనా అనుకూల విద్యార్థి మహమూద్ ఖలీల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ట్రంప్ వైఖరి మార్చుకోవాలని తెలిపారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం ఇది రెండో సారి. అంతకుముందు ఏప్రిల్ 5న కూడా దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులను జాబ్ నుంచి తీసేయడం, వలస దారులపై కఠిన చర్యలు తీసుకోవడం, ప్రతీకార సుంకాలు విధించడం సహా పలు డిసిషన్స్ తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లోనూ పలు మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన విధానాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story