మరో షాకిచ్చిన అమెరికా.. ఆ భారత కంపెనీలపై ఆంక్షలు

by Yella Dhawani Reddy |

అగ్రరాజ్యం అమెరికా మరో షాకిచ్చింది. ఇప్పటికే భారత్‌పై 25శాతం సుంకాల విధించిన సంగతి తెలిసిందే.

మరో షాకిచ్చిన అమెరికా.. ఆ భారత కంపెనీలపై ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు (India-USA) మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన వాషింగ్టన్.. తాజాగా ఆరు భారతీయ చమురు కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రో కెమికల్ (Iran Oil) ఉత్పత్తులు దిగుమతి చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలకు పూనుకుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇది భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీయనుంది.

ఈ చర్యలు అమెరికా 'మ్యాక్సిమమ్ ప్రెజర్' వ్యూహంలో భాగం. ఇది ఇరాన్ నిషేధిత చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి ఉద్దేశించబడింది. ఇరాన్ ఈ ఆదాయాన్ని మిడిల్ ఈస్ట్‌లో స్థిరత్వాన్ని కుదించడానికి, తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడానికి వాడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఇరాన్‌ చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాగే అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఇక భారత్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీలపైనా ఈ ఆంక్షలు విధించింది. ఇక ఆంక్షల నేపథ్యంలో ఆ కంపెనీల అమెరికాలో ఉన్న ఆస్తులు, అమెరికా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తులు ఫ్రీజ్ చేయబడ్డాయి. అమెరికా పౌరులు, సంస్థలు ఈ కంపెనీలతో ఇకపై వ్యాపారం చేయకూడదు. అంతేకాదు, ఈ ఆరు కంపెనీలలో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వాటా కలిగి ఉన్న ఇతర కంపెనీలపైనా కూడా ఇదే నిషేధం వర్తిస్తుంది.

ఇక భారత్‌కు ఇరాన్‌తో చరిత్రపూర్వక చమురు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అయితే, 2019లో అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించిన తర్వాత, భారత్ కూడా ఒత్తిడిలో భాగంగా అక్కడి నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించింది. కానీ కొంతమంది వ్యాపారులు ఇరాన్‌తో సంబంధాలు నేరుగా కాకుండా, మధ్యవర్తుల ద్వారా లేదా మూడవ దేశాల ద్వారా కొనసాగించినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ ఆంక్షలపై అభ్యంతరం చెప్పాలనుకునే సంస్థలు అమెరికా ట్రెజరీ విభాగంలోని విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) వద్ద పిటిషన్ వేయొచ్చు. తమ కార్యకలాపాలను మార్చినట్టు నిరూపించిన సంస్థలపై ఆంక్షలు తొలగించే అవకాశం ఉందని అమెరికా తెలిపింది.

ఆంక్షలు పడిన భారత కంపెనీలు ఇవే..

* గ్లోబల్ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌: జులై 2024 నుంచి జనవరి 2025 మధ్య కాలంలో 51 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్‌ను ఇరాన్ నుంచి కొన్నట్లు యూఎస్ ఆరోపించింది.

* జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024-25లో 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు అభియోగాల్లో పేర్కొంది.

* రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 22 మిలియన్‌ డాలర్ల విలువైన మిథనాల్, టోల్యూన్‌, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది.

* పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గతేడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌తో సహా ఇరాన్ పెట్రో కెమికల్స్‌ను కొనుగోలు చేసినట్లు అమెరికా తమ అభియోగాల్లో వెల్లడించింది.

* కాంచన్‌ పాలిమర్స్‌: 2024 ఫిబ్రవరి నుంచి జులై మధ్య 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలిథీన్‌, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను యూఏఈ మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ఆరోపించింది.

* ఆల్‌కెమికల్‌ సొల్యూషన్స్‌: ఇది పెట్రోకెమికల్‌ ట్రేడింగ్ కంపెనీ. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి 84 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు అమెరికా తన అభియోగాల్లో పేర్కొంది.

Next Story