పశ్చిమాసియా సంక్షోభం.. యుద్ధంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్

by Ramesh Naini |

ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, దేశంపై పడుతున్న ప్రభావంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్‌లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది.

పశ్చిమాసియా సంక్షోభం.. యుద్ధంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, దేశంపై పడుతున్న ప్రభావంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ (మంగళవారం) ఉన్నతాధికారులతో కీలక భద్రతా సమీక్ష జరిపారు. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, డీఆర్‌డీఓ ఛైర్మన్ సమీర్ కామత్‌ తదితరులతో ఆయన ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

ప్రధాని వ్యాఖ్యలపై విపక్షాల ఫైర్..

హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను ప్రధాని మోడీ లోక్‌సభలో తీవ్రంగా ఖండించారు. ఇంధనం, ఎరువుల సరఫరాపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ప్రధాని ప్రసంగంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండించక పోవడాన్ని తప్పుబట్టాయి. ప్రధాని ప్రసంగం ప్రగల్భాలు, పిరికితనంతో కూడుకున్నదని కాంగ్రెస్ విమర్శించగా.. ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి సంతాపం తెలపడానికి మూడు రోజులు ఎందుకు పట్టిందని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు.

కొనసాగుతున్న నౌకల రాకపోకలు..

కాగా, హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ముడి చమురు, గ్యాస్ రవాణా సవాలుగా మారినప్పటికీ, భారతీయ నౌకల రాకపోకలు మాత్రం సురక్షితంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. యూఏఈ, సౌదీల నుంచి బయలుదేరిన రెండు ఎల్పీజీ, ఒక క్రూడ్ ఆయిల్ క్యారియర్ భారత్ వైపు వస్తున్నట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. వీటిలో ‘ఎంవీ జగ్ వసంత్’ మార్చి 26న కాండ్లా పోర్టుకు, ‘ఎంవీ పైన్ గ్యాస్’ మార్చి 28న న్యూ మంగళూరుకు చేరుకోనున్నాయి.

Next Story