Siddaramaiah: స్టేట్ బ్యాంకులో కన్నడ వివాదం.. స్పందించిన సీఎం

by Shamantha N |

బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో కన్నడ భాషపై వివాదం చెలరేగింది. బ్యాంకు మేనేజర్ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు.

Siddaramaiah: స్టేట్ బ్యాంకులో కన్నడ వివాదం.. స్పందించిన సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో కన్నడ భాషపై వివాదం చెలరేగింది. బ్యాంకు మేనేజర్ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. బ్యాంకు మేనేజర్‌ పౌరులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదని విమర్శించారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని కోరారు. కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలని సూచించారు. బెంగళూరులోని సూర్యనగరలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించిన ఎస్‌బీఐ మేనేజర్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, ఎస్‌బీఐ ఆ మేనేజర్‌ను బదిలీ చేసిందని.. ఇంతటితో ఈ సమస్య పరిష్కారమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. మరోవైపు, భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అసలేం జరిగిందంటే?

కన్నడలో మాట్లాడాలని అడిగినందుకు బెంగళూరులోని సూర్యనగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్‌ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బ్యాంక్‌ మేనేజర్‌ను కన్నడలో మాట్లాడాలని కస్టమర్‌ అడగగా.. కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న నియమం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ..ఆమె కస్టమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఎన్నటికీ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటావో చేసుకోమని ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో కస్టమర్లతో ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. దీంతో ఎస్‌బీఐ ఆమెను బదిలీ చేసింది. అంతేకాకుండా, బ్యాంకు మేనేజర్ కామెంట్లపై కర్ణాటకలోని పలు చోట్ల భాషా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

Next Story