పశ్చిమ ఆసియాలో విమాన ప్రయాణాలపై అలర్ట్.. పైలట్లకు ALPA India కీలక సూచనలు

by Kema Shiva Kumar |

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ పైలట్లకు ALPA ఇండియా కీలక అడ్వైజరీ జారీ చేసింది.

పశ్చిమ ఆసియాలో విమాన ప్రయాణాలపై అలర్ట్.. పైలట్లకు ALPA India కీలక సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియా (Middle East)లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, విమాన ప్రయాణాల భద్రతపై భారతీయ పైలట్ల సంఘం ‘ALPA ఇండియా’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా, ఆకాశమార్గంలో ప్రయాణించేటప్పుడు అత్యున్నత స్థాయి అప్రమత్తత (Situational Awareness) పాటించాలని పైలట్లకు ఇవాళ కీలక అడ్వైజరీ జారీ చేసింది. పశ్చిమ ఆసియాలోని వివాదాస్పద ప్రాంతాల మీదుగా లేదా ఆ దేశాలకు విమానాలు నడిపేటప్పుడు పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చని అసోసియేషన్ హెచ్చరించింది. యుద్ధ వాతావరణం వల్ల ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే గగనతలం మూసివేత (Airspace Closures) వంటి నిర్ణయాలు వెలువడవచ్చని తెలిపింది.క్షిపణి, డ్రోన్ల సంచారం, జీపీఎస్ జామింగ్ వంటి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అంతరాయాలు, పౌర విమానాలను శత్రు విమానాలుగా పొరపాటు పడే (Misidentification) ప్రమాదం ఉందని పైలట్లకు వివరించింది.

రిస్క్ అసెస్‌మెంట్ తప్పనిసరి..

కేవలం రెగ్యులేటరీ సంస్థల అనుమతులు ఉన్నాయి కదా అని విమానాలు నడపకుండా, ప్రతి ప్రయాణానికి ముందు ‘ఆపరేషనల్ రిస్క్ అసెస్‌మెంట్’ నిర్వహించాలని ఎయిర్‌లైన్ సంస్థలను ALPA కోరింది. పైలట్లు కూడా విమానం ఎక్కే ముందు తాజా నోటమ్స్ (NOTAMs), కంపెనీ భద్రతా నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది.

బీమా రక్షణపై ఆందోళన

ఈ అడ్వైజరీలో బీమా (Insurance) అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. యుద్ధం లేదా ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ‘వార్-రిస్క్ క్లాజులు’ (War-risk clauses) కారణంగా బీమా కవరేజీ పరిమితం కావచ్చు లేదా పూర్తిగా రద్దు కావచ్చు. దీంతో పైలట్లు, సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు సంబంధించి క్లెయిమ్‌లలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో స్పష్టత తీసుకోవాలని విమానయాన సంస్థలను కోరింది.

పైలట్ల అలసటపై కూడా..

పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా విమానాలు దారి మళ్లించడం (Rerouting) వల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పైలట్ల పని గంటల పరిమితిని (FDTL) పెంచడంపై ALPA ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామంతో పైలట్లు తీవ్ర అలసటకు (Fatigue) గురై భద్రతాపరమైన పొరపాట్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Next Story