ముగ్గురు భారతీయులను కిడ్నాప్‌ చేసిన ఆల్‌ఖైదా ఉగ్రవాదులు

by Yella Dhawani Reddy |

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి (Mali) దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి.

ముగ్గురు భారతీయులను కిడ్నాప్‌ చేసిన ఆల్‌ఖైదా ఉగ్రవాదులు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి (Mali) దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 1న కాయెస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులను గుర్తు తెలియని దుండగులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ భారతీయులు ఆ ఫ్యాక్టరీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాడి సమయంలో వారు విధుల్లో ఉండటంతో దుండగులు వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ దుర్మార్గమైన హింసాత్మక చర్యను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందిస్తూ.. 'ముగ్గురు భారతీయుల అపహరణ ఘటనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వారి సురక్షితమైన, వేగవంతమైన విముక్తికి మాలీ ప్రభుత్వంతో మేము నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం' అని పేర్కొంది. ఇక ఇప్పటివరకు ఈ కిడ్నాప్‌కు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే మంగళవారం మాలీలో జరిగిన సమన్విత దాడులపై ఆల్‌ఖైదా ఉగ్రవాద (Al-Qaeda terrorists) అనుబంధ సంస్థ అయిన జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమిన్ (JNIM) బాధ్యతను స్వీకరించినట్టు సమాచారం.

ఇక ఈ ఘటన నేపథ్యంలో మాలీలో ఉన్న ఇతర భారతీయులకు విదేశాంగ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అలాగే బమాకోలోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.

Next Story