Air India Crash: మృత్యుంజయుడిని వెంటాడుతున్న ప్రమాద దృశ్యాలు

by S Gopi |

క్రాష్ సైట్ దృశ్యాలు, తప్పించుకోవడం, అతని సోదరుడి మరణం ఇప్పటికీ విశ్వాస్‌ను వెంటాడుతూనే ఉన్నాయని అతని బంధువు అన్నారు.

Air India Crash: మృత్యుంజయుడిని వెంటాడుతున్న ప్రమాద దృశ్యాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఘోర ప్రమాదం నుంచి బయటపడినందుకు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులలో ఒకడని అందరూ అభినందించారు. కానీ, అదే ప్రమాదం అతడిని నిద్రకు, మనశ్శాంతికి దూరం చేస్తోంది. ఇటీవల జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ ఆ ప్రమాదానికి సంబంధించిన భయానక క్షణాల నుంచి బయటపడలేకపోతున్నాడని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. క్రాష్ సైట్ దృశ్యాలు, తప్పించుకోవడం, అతని సోదరుడి మరణం ఇప్పటికీ విశ్వాస్‌ను వెంటాడుతూనే ఉన్నాయని అతని బంధువు సన్నీ అన్నారు. విదేశాల్లో ఉన్న మా బంధువులతో సహా చాలామంది విశ్వాస్ క్షేమం గురించి ఫోన్ చేస్తున్నారు. కానీ అతను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు. ప్రమాదం, సోదరుడి మరణానికి సంబంధించి మానసికంగా కృంగిపోతున్నాడు. ఇప్పటికీ అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొని, మళ్లీ నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నాడు. మానసిక చికిత్స కూడా అందిస్తున్నామని, క్రమం తప్పకుండా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తోందని బంధువులు చెప్పారు. ప్రస్తుతానికైతే విశ్వాస్ తిరిగి లండన్‌కు వెళ్లే ఆలోచన చేయట్లేదని వారు వెల్లడించారు.

జూన్‌ 12న జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. 242 మందితో టేకాఫ్‌ అయిన ఎయిర్ఇండియా విమానం సెకండ్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి విశ్వాస్‌ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. బ్రిటన్‌లో నివాసముండే విశ్వాస్‌, గుజరాత్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చాడు. మళ్లీ రిటర్న్ జర్నీ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జూన్ 17న విశ్వాస్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అదే రోజు, డీన్ఏ ఆధారంగా సోదరుడు అజయ్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. చివరగా, విశ్వాస్ జూన్ 18న డయ్యూలోని శ్మశాన వాటికకు తన సోదరుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్తున్నట్టు వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Next Story