బోయింగ్‌కు ఇది కొత్తేం కాదు.. 346 మంది చనిపోతే.. డబ్బులిచ్చి తప్పించుకుంది!

by Phanindra |   (  Updated:2025-06-12 15:46:43  IST  )

బోయింగ్‌ విమానాలు కూలడం ఇది కొత్తేం కాదు. గతంలో రెండు విమానాలు కూలి 346 మంది చనిపోతే, యూఎస్‌కు డబ్బులిచ్చి తప్పించుకుంది!

బోయింగ్‌కు ఇది కొత్తేం కాదు.. 346 మంది చనిపోతే.. డబ్బులిచ్చి తప్పించుకుంది!
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ మోడల్. ఈ మోడల్ విమానం కూలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2011లో లాంచ్ చేసిన ఈ విమానం మోడల్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఈ విమానాల్లో ఇంజిన్ సమస్యలున్నట్లు పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఈ విమానాలను వాడటం మానేశాయి. అయితే బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సర్వీస్ రికార్డు బాగానే ఉంది. కానీ కొన్నేళ్లుగా డ్రీమ్‌లైనర్‌లో వస్తున్న సమస్యలపై యూఎస్ సేఫ్టీ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దర్యాప్తు చేస్తోంది. గతేడాది లాటామ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక డ్రీమ్‌లైనర్ విమానం గాల్లో ఉండగా సడెన్‌గా అదుపుతప్పడంతో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీనిపై కూడా ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తోంది.

అయితే బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలు సేఫ్ కాదని, వీటి అసెంబ్లీలో లోపాలు ఉన్నాయని ఆ కంపెనీలో పనిచేసిన మాజీ ఇంజినీరు ఒకరు చెప్పడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలను కంపెనీ కొట్టిపారేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1100 పైచిలుకు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలు సర్వీసులో ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని ప్రధాన ఎయిర్‌లైన్స్ అన్నీ ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి. మిగతా విమానాలతో పోలిస్తే తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరాలు వెళ్లగలగడం, తక్కువ చప్పుడుతో పనిచేయడం వంటి కారణాల వల్ల ఈ విమానానికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

బోయింగ్ విమానాల్లో సమస్యలతో గతంలో రెండు భారీ ప్రమాదాలు జరిగాయి. 2018లో ఇండోనేషియాలో, 2019లో ఇథియోపియాలో విమానాలు కూలిపోయాయి. ఈ రెండు ప్రమాదాల్లో కలిపి మొత్తం 346 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదాల్లో ఉపయోగించిన విమానాలు బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్‌కు చెందినవి. అప్పట్లో కొత్తగా వచ్చిన ఈ మోడల్‌ను చాలా కంపెనీలు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత ఈ ప్రమాదాలు జరగడంతో బోయింగ్ కంపెనీపై బాధితులు కోర్టుకెక్కారు. ఈ కేసులో తమపై ప్రాసిక్యూషన్ జరగకుండా ఉండేందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌తో బోయింగ్ కంపెనీ డీల్ చేసుకుంది. మొత్తం 1.1 బిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించడానికి ఒప్పుకుంది. దీంతో బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ విమానాలను చాలా కంపెనీలు వదిలించుకున్నాయి. ఈ డీల్ జరిగిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు 787 డ్రీమ్‌లైనర్ కూడా క్రాష్ అవడం గమనార్హం. కాగా, ఎయిరిండియా వద్ద ప్రస్తుతం 30 డ్రీమ్‌లైనర్ విమానాలున్నాయి. 2012 నుంచి ఈ విమానాలను ఎయిరిండియా ఉపయోగిస్తోంది.

Next Story