- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: ఎయిరిండియా ఏ క్యా హై?.. ప్రమాదం తర్వాత లండన్ కు తొలిఫ్లైట్ లోనూ సమస్య
ఎయిరిండియా విమానాల పరిస్థితిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన దుర్ఘటన కళ్ల ముందు కదులాడుతోంది. ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్ (Boeing) 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అవుతూ కుప్పకూలింది. 270 మందికి పైగా నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈ ప్రమాదం ఘటన మరువక ముందే వరుసగా ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం విమాన ప్రయాణికులను హడలెత్తిస్తోంది. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఏఐ 171 ఫ్లైట్ స్థానంలో ఎయిరిండియా తీసుకువచ్చిన ఏఐ 159 విమానంలోనూ తాజాగా సాంకేతిక సమస్య వెలుగు చూడటం కలకలం రేపుతోంది. అహ్మదాబాద్ (Ahmedabad crash) నుంచి లండన్ రూట్ కోసం ఎయిరిండియా ఏఐ 159 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. గత వారం విమాన ప్రమాదం తర్వాత లండన్ కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ ఇదే. ఇవాళ మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో 1:10 గంటలకు లండన్ కు బయలుదేరేందుకు రెడీఅయింది. అయితే టేకాఫ్ కంటే ముందు సిబ్బంది సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులకు కిందకు దింపేశారు. తొలుత ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన నిర్వహాకులు చివరకు సర్వీస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వరుసగా సమస్యలు:
శనివారం రాత్రి గువాహటి-కోల్ కతా ఎయిరిండియా విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తింది. గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానంలో టేకాఫ్ కు ముందు సాంకేతిక సమస్య గుర్తించడంతో రన్ వే పై ఆపేశారు. ప్రయాణికులు రెండు సార్లు విమానం దిగాల్సి వచ్చింది. సోమవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. తాజాగా ఎయిరిండియా విమానం (ఏఐ180) శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్ కతా మీదుగా ముంబయికి వెళ్తోన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్ కతా విమానాశ్రయం చేరుకోగానే ఇంజిన్ లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్లు వెంటనే అప్రమత్తం అయ్యారు. దీంతో భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దింపేసి ఫ్లైట్ ను అధికారులు తనిఖీలు చేశారు. అహ్మదాబాద్ ఘోర విషాదం తర్వాత కూడా ఎయిరిండి విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో వామ్మో ఎయిరిండియా! అనే పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికుల భద్రతను గాల్లో పెడుతున్న ఎయిరిండియా?:
విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం వెనుక ఎయిరిండియా నిర్లక్ష్యం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత టాటా యాజమాన్యంలోని ఎయిరిండియాపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కార్పొరేట్ లాభాలు కోసం నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఎయిరిండియా విమానాల్లో తరచూ ఇబ్బందులు వస్తున్నాయని పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను గాలికొదిలి, నిర్వాహకులు తమ లాభాల మీదే దృష్టి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిరిండియా విమానాల నిర్వహణలో లోపాలు, సిబ్బందికి పని ఒత్తిళ్లు ఉన్నాయని ఈ సమస్యలను పరిష్కరించడంలో ఎయిరిండియా నిర్వాహకులు ఘోరంగా విఫలం అవుతున్నారని జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడుతున్నాయి.
కాపీ పేస్ట్ సీఈవో.. ఎయిరిండియా సీఈవోపై నెటిజన్ల ట్రోల్స్:
తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా సీఈవో క్యాంప్ బెల్ విల్సన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన విషయంలో ఆయన తెలిపిన సంతాపంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన సంతాపం నోట్ ను కాపీ పేస్ట్ చేశారని దుయ్యబడుతున్నారు. ఈ ఏడాది జనవరి 30న వాషింగ్టన్ డీసీ సమీపంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ 5342 విమానం ఓ సైనిక విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 67 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ సీఈవో సంతాప నోట్ ను రిలీజ్ చేశారు. అయితే అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిరిండియా సీఈవో కాంప్ బెల్స్ రిలీజ్ చేసిన సంతాప నోట్ చాలా వరకు అమెరికన్ ఎయిర్ లైన్స్ సీఈవో సంతాప నోట్ దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి.ఈ రెండు నోట్ లకు సంబంధించి పోలికలను హైలెట్ చేస్తూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇది కాపీ పేస్ట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు సీఈవోలకు సంబంధించిన సంతాప నోట్ లపై నెటిజన్లు చేస్తున్న పోస్టుపై ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సైతం స్పందిస్తూ ఇది మంచి దృక్పథం అంటూ సెటైర్ వేశారు. మరి కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ అయితే ఎయిర్ ఇండియా బాస్ చివరకు సంతాప సందేశాన్ని కూడా కాపీ చేశారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఎందరికో డ్రీమ్.. సమస్యలతో హడల్:
విమాన ప్రయాణం చాలా మందికి ఓ డ్రీమ్. జీవితంలో ఒక్కసారైనా ఆకాశమార్గంలో ప్రయాణాన్ని అనుభూతి చెందాలని ఆశపడుతుంటారు. అలాంటి వారిని వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఎయిరిండియా విమానాల పరిస్థితి ఇలా ఉంటే మొత్తంగా విమాన ప్రయాణాలు అంటే జంకే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులు, ప్రమాదాలతో జనాలు ఫ్లైట్ జర్నీ అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎక్కువగా విమాన ప్రయాణాలను వినియోగిస్తుంటారు. అలాంటిది ఎన్నో ఆశలతో విదేశాలకు బయలుదేరుతున్న వారి జీవితాలు ఇలా ఆకాశంలోనే అర్థాంతరంగా గాల్లో కలిసితున్నాయి. ఇక దేశీయంగా హెలికాప్టర్ల ప్రమాదాలు సైతం అంతే స్థాయిలో హడలెత్తిస్తున్నాయి. దీంతో ఎయిర్ జర్నీ ఎంతవరకు సేఫ్ అనేది ప్రజల్లో ఆందోళనగా మారింది.






