AI: ఏఐతో సంతన ప్రాప్తి.. 18 ఏళ్లుగా పిల్లల కోసం జంట ఎదురుచూపులకు ఏఐ పరిష్కారం

by Prasad Jukanti |

18 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఓ జంటకు ఏఐ పరిష్కారం చూపింది.

AI: ఏఐతో సంతన ప్రాప్తి.. 18 ఏళ్లుగా పిల్లల కోసం జంట  ఎదురుచూపులకు ఏఐ పరిష్కారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు అడ్వాన్స్ గా మారుతోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఎంట్రీ ఇచ్చిన ఏఐ (Artificial Intelligence) ఇప్పుడు వైద్య రంగంలో గేమ్ చేంజర్ గా మారుతోంది. ఇప్పటికే వ్యాధి నిర్ధారణ, చికిత్సల విషయంలో కచ్చితత్వంతో సేవలు అందిస్తున్న ఏఐ.. తాజాగా ఓ జంట సంతానం కోసం 18 సంవత్సరాల ఎదురు చూపులకు పరిష్కారం చూపించింది. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశలు వదులుకున్న ఆ జంట గర్భం దాల్చడానికి ఏఐ సహాయం చేసింది.

పేరు తెలియని ఓ జంట గత 18 ఏళ్లుగా గర్భం దాల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక సార్లు ఐవీఎఫ్ ప్రయత్నాలు చేశారు. పురుష భాగస్వామి సెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం వల్ల వారి ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. చివరకు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (సీయూఎఫ్ సీ) లో కొత్త విధానం ప్రయత్నించేందుకు ఆసక్తి చూపి సక్సెస్ అయ్యారు. ఇక్కడ యూనివర్సిటీ పరిశోధకులు సెర్మ్ ను గుర్తించడానికి ఏఐని ఉపయోగించే స్టార్ (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) పద్దతిని ఉపయోగించారు. ఇక్కడి సంతానోత్పత్తి కేంద్రంలోని పరిశోధకులు ఏఐ ఆధారిత వ్యవస్థతో వీర్య నమూనాను పరిశీలించి కనుగోని దాన్ని ఐవీఎఫ్ ద్వారా భార్య అండాన్ని ఫలదీకరణం చేయించారు. ఇది సక్సెస్ కావడంతో స్టార్ పద్దతిని ఉపయోగించి గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె నిలిచినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది.

సీయూఎఫ్ సీ డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ అతని బృందం ఐదేళ్లు పరిశోధనల తర్వాత ఈ స్టార్ పద్దతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనల ద్వారా వెలువడిన ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. సెర్మ్ కనుగొనేందుకు ఒక వ్యక్తి నమూనాలను అత్యంత అనుభవం కలిగిన నిపుణుడికి అందించగా రెండు రోజులు వెతికినా అతడు స్పెర్మ్ ను కనుగొనలేకపోయాడు. కానీ ఏఐ ఆధారిత స్టార్ విధానంలో నమునాను ఇవ్వగా గంటలోనే అది 44 స్ఫెర్మ్ లను కనుకొందని ఇది గేమ్ చేంజర్ అని ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన విలియమ్స్ చెప్పారు. వీర్య నమూనాను సూక్ష్మదర్శిని కింద ప్రత్యేకంగా రూపొందించిన చిప్ పై ఉంచగా స్టార్ వ్యవస్థ మొత్తం వీర్య నమూనాను స్కాన్ చేస్తుంది. ఇది గంటలో ఎనిమిది మిలియన్లకు పైగా చిత్రాలను సేకరించి వీర్యకణాలను గుర్తిస్తుందని తెలిపారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story