AI: లోన్ కట్టకపోతే ఇక అంతే.. రుణాల రికవరీ కోసం బ్యాంకుల 'ఏఐ' అస్త్రం

by Prasad Jukanti |   (  Updated:2025-09-23 11:54:31  IST  )

బ్యాంకులో లోన్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా మొండికేస్తున్నవారికి బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాయి.

AI: లోన్ కట్టకపోతే ఇక అంతే.. రుణాల రికవరీ కోసం బ్యాంకుల ఏఐ అస్త్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంకుల్లో లోన్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా మొండికేస్తున్న వారి పైకి బ్యాంకులు (banking) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాయి. ఇప్పటి వరకు లోన్ రికవరీ ఏజెంట్ల ద్వారా లోన్ల రికవరీ ప్రాసెస్ చేసిన బ్యాంకులు ఇకపై 'ఏఐ అవతార్స్’ ను (AI Avatar) రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొండి బకాయిలను తిరిగి రాబట్టుకునేలా రుణ గ్రహితలకు వీడియో కాల్స్, మెసేజులు చేసేందుకు ఏఐ అవతార్స్ ను ఆయా బ్యాంకులు సిద్ధం చేసుకోబోతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మానవ వనరులతో పోలిస్తే చీప్:

ప్రస్తుతం లోన్ రికవరీల కోసం బ్యాంకులు రికవరీ ఏజెంట్ల సేవలను వినియోగించుకుంటున్నాయి. అయితే ఒక ఏజెంట్ కోసం నెలకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు అవుతోందని నెల మొత్తంలో సగటున 250 కేసులకు సంబంధించిన వాటినే వీళ్లు ఫాలోఅప్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ అంచనా. అదే మానవ ఏజెంట్ల కంటే ఏఐ ఏజెంట్ల (AI loan recovery) ఖర్చు రూ. 40-60 శాతం వరకు చౌకగా లభించనుందని, అలాగే ఒక్క ఏఐ ఏజెంట్ మనిషితో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ కాల్స్ చేయగలుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇవి విరామం లేకుండా నిరంతరాయం పని చేయడం వల్ల లోన్ల రికవరీ కోసం ఆర్బీఐ విధించిన నిబంధనల పరిధిని అధిగమించవచ్చని బ్యాంకులు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం.

ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల కంటే ముందు లేదా సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రహీతలకు ఎలాంటి కాల్స్ చేయకూడదు. అలాగే రుణగ్రహిత లేదా వారి కుటుంబ సభ్యులను వేధించడం బెదిరించడం అవమానించడం, గోప్యత ఉల్లంఘించడం వంటి చర్యలు చేయకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాల కారణంగా ఈ గైడ్ లైన్స్ బ్రేక్ అవుతున్నాయి. కానీ ఏఐ ఏజెంట్లు అలా జరగకుండా ఓవైపు ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు లీగల్ అంశాలను గుర్తు చేస్తూ లోన్ రీ పేమెంట్‍ను గుర్తు చేయనున్నాయి. మరి ఏఐ ఎంట్రితో బ్యాంకుల లోన్ల రికవరీలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

Next Story