వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.. కేంద్రానికి భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్

by Sathputhe Rajesh |
వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.. కేంద్రానికి భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : 2025-26 యూనియన్ బడ్జెట్‌కు ముందు భారతీయ కిసాన్ యూనియన్ కేంద్రం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచింది. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో నిర్మలా సీతారామన్‌తో యూనియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ ఈ భేటీలో రైతుల డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ పరికరాలను, పశువుల, పౌల్ట్రీ దాణా, ఫర్టిలైజర్లు, విత్తనాలు, మందులను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని కోరారు. రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ ఉన్నప్పుడే రైతులు పన్నుల నుంచి విముక్తి పొందారని కేంద్రానికి ఇచ్చిన మెమొరండంలో రైతుల బృందం తెలిపింది. వ్యవసాయ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా.. అనేక మంది నిర్లక్ష్యానికి గురవుతున్నారని స్పష్టం చేశారు.

పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై ఓ ప్రణాళికను రూపొందించాలని కోరారు. పంట చేతికొచ్చే సమయంలో క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా, ఓపెన్ మార్కెట్ పంటల ధరలు పడిపోవడం, ప్రకృతి విపత్తలను పరిగణలోకి తీసుకుని కనీస మద్దతు ధర ప్రణాళిక రూపొందించాలని కోరారు. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, పాలు, తేనేలను సైతం కనీస మద్దతు ధర కల్పించే జాబితాలో చేర్చాలని కోరారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6వేల నుంచి రూ.12వేలకు పెంచాలన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు ఒక శాతం వడ్డీతో లోన్లు ఇవ్వాలని కోరారు. వ్యవసాయాన్ని రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లోని ఉమ్మడి జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఐఏఎస్ కేడర్ తరహాలో ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ కేడర్‌ను నియమించాలని కోరారు. దేశంలో వ్యవసాయ మార్కెట్ల సంఖ్యను మరింత పెంచాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed