ఎమ్మెల్యేలకు మసాజ్ కుర్చీలు.. స్మార్ట్ లాక్స్..

by Ajay Maddhiboyina |

శాసన సభలో ఎమ్మెల్యేల హాజరును పెంచడానికి, సభలో వారి భాగస్వామ్యాన్ని మెరుగు పరచడానికి స్పీకర్ చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.

ఎమ్మెల్యేలకు మసాజ్ కుర్చీలు.. స్మార్ట్ లాక్స్..
X

- ఎమ్మెల్యేలకు తగినంత విశ్రాంతి అవసరం

- ఇప్పటికే రిక్లయినర్లు ఏర్పాటు చేశాం.. ఇకపై మరిన్ని సౌకర్యాలు

- కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని విధాన సౌద భవనంలో రిక్లెయినర్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఎమ్మెల్యేల కోసం స్మార్ట్ లాక్స్, మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు స్పీకర్ ఖాదర్ తెలిపారు. శాసన సభ్యులకు వారి గదుల్లో స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడం వల్ల భద్రత పెరగడంతో పాటు, సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుందని స్పీకర్ చెప్పారు. దీంతో పాటు ఎమ్మెల్యేలకు కొన్ని అదనపు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో అసెంబ్లీ లాబీల్లో రిక్లయినర్లతో పాటు మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. శాసన సభ్యులు ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని.. అవసరాలని స్పీకర్ ఖాదర్ అన్నారు. ఈ సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులని చెప్పారు.

శాసన సభలో ఎమ్మెల్యేల హాజరును పెంచడానికి, సభలో వారి భాగస్వామ్యాన్ని మెరుగు పరచడానికి స్పీకర్ చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒత్తిడితో పని చేస్తారని, పైగా వారందరూ సీనియర్ సిటిజన్లు కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు మంచివే అని అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. అయితే స్పీకర్ చర్యలను బీజేపీ వ్యతిరేకించింది. ముఖ్యమైన పాలనా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవరసరమైన ఖర్చులు చేయడం ఏంటని విమర్శించింది. రాష్ట్రంలో నిధుల కొరత కారణంా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లాబీల్లో కాసేపు సేదదీరడానికి 15 రిక్లయినర్లను ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ ఖాదర్ గత వారమే చెప్పారు. భోజన విరామ సమయం తర్వాత విధాన సౌద నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి సభకు రావడం లేదన్నారు. ఏడాదికి అసెంబ్లీ 30 రోజులే పని చేస్తుంది. కాబట్టి రిక్లయినర్లు, మసాజ్ కుర్చీలను కొనడం లేదని.. కేవలం వాటిని అసెంబ్లీ సెషన్స్ సమయంలో మాత్రమే తీసుకొని వచ్చి.. ఆ తర్వాత తిరిగి పంపుతామని స్పీకర్ ఖాదర్ వివరించారు.

Next Story