IIT Bombay: జేఎన్ యూ, జామియా యూనివర్సిటీ బాటలో ఐఐటీ బాంబే

by Shamantha N |

జేఎన్ యూ, జామియా యూనివర్సిటీ బాటలోనే ఐఐటీ బాంబే వెళ్తోంది. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసింది.

IIT Bombay: జేఎన్ యూ, జామియా యూనివర్సిటీ బాటలో ఐఐటీ బాంబే
X

దిశ, నేషనల్ బ్యూరో: జేఎన్ యూ, జామియా యూనివర్సిటీ బాటలోనే ఐఐటీ బాంబే వెళ్తోంది. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసింది. ‘తుర్కియేకి సంబంధించిన ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా, తదుపరి నోటీసు వచ్చే వరకు టర్కిష్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను ఐఐటీ బాంబే నిలిపివేస్తోంది’ అని ఎక్స్‌లో పేర్కొంది. అయితే, దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), జామియా మిలియా ఇస్లామియాలు కూడా టర్కిష్ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఇటీవలే నిలిపివేశాయి. ఆ పరిణామం జరిగిన కొద్దిరోజులకే ఈ నిర్ణయం వెలువరించింది. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ఐఐటీ బాంబే సోషల్ మీడియా వేదికగా శనివారం ఈ మేరకు ప్రకటించింది. మరోవైపు, పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నది.

ఉగ్రదాడి..

కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడి జరిగింది. టూరిస్టులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన సైనిక చర్యలను టర్కీ వ్యతిరేకించింది. పైగా పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. అంతేగాక టర్కీ అందజేసిన డ్రోన్లను భారత్‌పైకి పాకిస్థాన్‌ ప్రయోగించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన టర్కీపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బాయ్‌కాట్‌ టర్కీ పేరుతో ఆ దేశ వస్తువులను బహిష్కరించారు. అలాగే ట్రావెల్‌ ఏజెన్సీలు కూడా టర్కీతోపాటు అజర్‌బైజాన్‌కు టూర్‌ ప్యాకేజీలు నిలిపివేశాయి.

Next Story