డ్రైవర్‍తో ఎఫైర్.. భర్తను పాముతో కాటు వేయించి చంపిన స్కూల్ యజమాని భార్య

by Prasad Jukanti |

ప్రియుడి మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను పాము కాటు వేయించి చంపేసిందో భార్య.

డ్రైవర్‍తో ఎఫైర్.. భర్తను పాముతో కాటు వేయించి చంపిన స్కూల్ యజమాని భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో రోజు రోజుకు మానవ విలువలు మంట కలుస్తున్నాయి. బతికున్నంత కాలం ఒకరికొకరు తోడునీడగా ఉండాల్సిన భార్యభర్తలు పరాయి బంధాల మోజులో పడి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా స్కూల్ బస్సు డ్రైవర్‍తో ఎఫైర్ పెట్టుకున్న ఓ స్కూల్ నిర్వాహకుడి భార్య తన భర్తను పథకం ప్రకారం హత్య చేయించడం కలకలం రేపింది. ఆపై తన భర్త పాముకాటుతో మరణించినట్లు అందరిని నమ్మించేందుకు నాటకమమాడి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఉత్తరప్రదేశ్‍లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమ వివాహం.. ఆపై ఎఫైర్:

పోలీసుల కథనం ప్రకారం భందోరా గ్రామానికి చెందిన అతుల్ పన్వార్ (35), దామిని అనే మహిళను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు హస్తినాపూర్‌లో 'కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్' నడుపుతున్నారు. ఈ క్రమంలో దామినికి అదే స్కూల్ డ్రైవర్ తుషార్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్తను అడ్డు తప్పిస్తే అతడి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు రూ.20 లక్షలు వస్తాయని ఆపై తామిద్దరం పెళ్లి చేసుకోవచ్చని దామిని ఆమె ప్రియుడు తుషార్ కలిసి పన్వార్ హత్యకు ప్లాన్ చేశారు.

నిద్రమాత్రలు ఇచ్చి.. బెడ్‌పై పామును వదిలి:

పథకం ప్రకారం గత గురువారం రాత్రి దామిని తన భర్త అతుల్‌కు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను గాఢ నిద్రలోకి జారుకోగానే దామిని ఆమె ప్రియుడు తుషార్ కలిసి అతుల్ కప్పుకున్న దుప్పటిలోపలికి పామును వదిలారు. ఆ పాము కాటు వేయడంతో అతుల్ మరణించాడు. శుక్రవారం ఉదయం దామిని ఏమీ తెలియనట్టు భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బెడ్‌పై పాము కూడా దొరకడంతో అంతా నిజమైన పాము కాటుగా నమ్మారు.

నిందితుల ఫోన్లలో పాము ఫోటో:

అయితే పాము కాటు వేసిన తీరు అక్కడ పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక విశ్లేషణ, మొబైల్ కాల్ డేటాను పరిశీలించారు. దామిని, డ్రైవర్ తుషార్ నిరంతరం మాట్లాడుకున్నట్లు తేలింది. తుషార్ మొబైల్‌ను తనిఖీ చేయగా అందులో ఒక డబ్బాలో బంధించిన పాము ఫోటో లభ్యమైంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. పాము తేవడానికి సహాయం చేసినందుకు సోను, ఉదయ్‌లకు రూ.5 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాడు. కాగా 20 రోజుల క్రితం కూడా అతుల్‌ను కారుతో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించారని కానీ ఆ సమయంలో హెల్మెట్ ధరించి ఉండటం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడని మీరట్ ఎస్ఎస్పీ అవినాష్ పాండే వెల్లడించారు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

Next Story