- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maharashtra: మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ అదనపు బాధ్యతలు
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఆయనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సంస్కృతంలో ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ దేవవ్రత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. 2024, జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ నెల ప్రారంభంలో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో రాధాకృష్ణన్ పదవీ విరమణ చేశారు. కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కొత్త గవర్నర్‌ను అభినందించారు. శాసన మండలి చైర్మన్ రామ్ షిండే, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ నీలం గోర్హే, సీనియర్ మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, భారత నావికాదళ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ విద్యావేత్త, ప్రకృతి వైద్యం, యోగ శాస్త్ర నిపుణులు, సామాజిక కార్యకర్త అయిన ఆచార్య దేవవ్రత్, 2019, జూలై నుంచి గుజరాత్ గవర్నర్‌గా ఉన్నారు. అంతకుముందు 2015, ఆగస్టు నుంచి 2019, జూలై వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన చరిత్ర, హిందీలో సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, బీఎడ్, యోగా సైన్స్‌లో డిప్లొమా, ప్రకృతి వైద్యం, యోగ శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆయన అనేక సామాజిక, విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.






