- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 7 కీలక అంశాలతో ఆఫ్ మ్యానిఫెస్టో ఇదే..!
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం 'మధ్య తరగతి మ్యానిఫెస్టో'ను విడుదల చేసింది. ఈ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం ఏడు కీలక డిమాండ్లను పొందుపర్చారు. మ్యానిఫెస్టో విడుదల చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మన దేశంలోని పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని అన్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందుకే మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆప్ ఈ మ్యానిఫెస్టోను రూపొందించిందన్నారు. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ, వాటిని పలువురు ఉచితాలంటూ విమర్శిస్తున్నారని తెలిపారు.
ఆప్ ప్రవేశపెట్టనున్న ఏడు డిమాండ్లు..
* కేంద్ర బడ్జెట్‌లో విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచాలి. ప్రైవేటు పాఠశాలలోఫీజులపై ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
* మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నత విద్య చదివే వారికి సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి.
* ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచాలి. ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయాలి.
* ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలి.
* నిత్యవసర వస్తువులపై GST తొలగించాలి.
* సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు ప్రవేశపెట్టాలి.
* దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి. దేశ వ్యాప్తంగా రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించాలి.
బరిలో 699 మంది అభ్యర్థులు..
ఇక, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నీటికీ ఒకే విడతలో వచ్చే నెల 5న పోలింగ్ జరుగనుంది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అర్వింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూడిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఢిల్లీలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే.






