- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో బీజేపీకి పెరిగిన ఓటింగ్
ఢిల్లీలోని అసెంబ్లీ నియోజకవర్గాలను ఎస్సీ, ముస్లిం ఆధిపత్యం, అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించారు.

- ఢిల్లీలో విన్నింగ్ మార్జిన్ ఆప్‌కే ఎక్కువ
- గతంతో పోలిస్తే తగ్గిన ఆప్ విన్నింగ్ మార్జిన్
- ముస్లిం, అర్బన్, రూరల్‌లో పట్టు నిలుపుకున్న ఆప్
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల తర్వాత అద్భుత విజయాన్ని సాధించింది. అధికార ఆప్‌ను మట్టికరిపించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఫిబ్రవరి 8న వెల్లడైన ఫలితాలను విశ్లేషిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆప్ 40 సీట్లను కోల్పోయి 22కే పరిమితం కాగా.. బీజేపీ 40 సీట్లను కలుపుకొని 48 స్థానాలతో అధికారంలోక వచ్చింది. అయితే బీజేపీ, ఆప్ మధ్య కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. బీజేపీ 14,725 ఓట్ల సగటుతో 48 సీట్లు గెలిచింది. ఆప్ 17,054 ఓట్ల సగటుతో 22 సీట్లు గెలిచింది. అంటే బీజేపీ కంటే ఆప్ విన్నింగ్ మార్జినే ఎక్కువగా ఉంది. 2020లో బీజేపీ 8 సీట్లు గెలిచినప్పుడు దాని విన్నింగ్ మార్జిన్ 12,271గా ఉంది. అదే సమయంలో 62 సీట్లు గెలిచిన ఆప్ విన్నింగ్ మార్జిన్ 22,076గా ఉంది. 2020, 2025 పోలింగ్ సరళిన పరిశీలిస్తే బీజేపీ 2500 ఓట్ల మేర విన్నింగ్ మార్జిన్ పెంచుకోగా.. ఆప్ మాత్రం 5వేల ఓట్ల మేర విన్నింగ్ మార్జిన్ కోల్పోయింది.
ఢిల్లీలోని అసెంబ్లీ నియోజకవర్గాలను ఎస్సీ, ముస్లిం ఆధిపత్యం, అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించారు. ముస్లిం డామినేషన్, అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ విన్నింగ్ మార్జిన్లు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో బీజేపీ విన్నింగ్ మార్జిన్స్ గణనీయంగా పెరిగాయి. 12 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఆప్ ఎనిమిది సీట్లను 11,789 ఓట్ల విన్నింగ్ మార్జిన్‌తో గెలిచింది. కానీ బీజేపీ నాలుగు సీట్లను 12,755 ఓట్ల విన్నింగ్ మార్జిన్‌తో కైవసం చేసుకుంది. 2020లో ఆప్ అన్ని ఎస్సీ రిజర్వుడు సీట్లను గెలిచింది. అప్పుడు ఆ పార్టీ సగటున 76,702 ఓట్లు సాధించగా.. విన్నింగ్ మార్జిన్ 29,133గా ఉంది. కానీ 2025లో విన్నింగ్ మార్జిన్ 14,000 పైగా పడిపోయింది. అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గణనీయంగా ఓట్ల శాతం పెంచుకుంది.
2020లో బీజేపీ ఒక్క ఎస్సీ సీటు కూడా గెలవలేదు. అప్పట్లో సగటున 48,959 ఓట్లు సాధించిందిి. కానీ ఈ ఏడాది ఎస్సీ నియోజకవర్గాల్లో సగటు ఓట్లను 11 వేల మేర పెంచుకొని 59,779కి చేరింది. ఫలితాల డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఆప్‌ను వదిలేసిన ఎస్సీ ఓటర్లు బీజేపీ వైపుకు మాత్రమే కాకుండా కాంగ్రెస్‌కు కూడా ఓటు వేసినట్లు కనపడుతోంది. 2020లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో 5,276 ఓట్ల సగటు సాధించగా.. ఈ ఏడాది 9,045 ఓట్లకు పెరిగింది.
ముస్లిం ఓటర్ల ఆధిపత్యం ఉన్న 10 సీట్లలో ఆప్ 7 సీట్లను 26,371 ఓట్ల సగటుతో గెలిచింది. అదే సమయంలో బీజేపీ 10,223 ఓట్ల సగటుతో మూడు సీట్లను గెలుచుకుంది. 2020లో ఆప్ ముస్లిం డామినేషన్ ఉన్న సీట్లలో తొమ్మిదింటిన 41,904 విన్నింగ్ మార్జిన్‌తో గెలిచింది. అంటే దాదాపు 15వేల ఓట్లను ఆప్ ఈ నియోజకవర్గాల్లో కోల్పోయింది. ఢిల్లీలో అర్బన్ నియోజకవర్గాలే ఎక్కువగా ఉంటాయి. ఇక 18 నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. 52 అర్బన్ నియోజకవర్గాలకు గాను బీజేపీ 35 సీట్లను 13,668 ఓట్ల సగటు విన్నింగ్ మార్జిన్‌తో గెలిచింది. మిగిలిన 17 సీట్లను ఆప్ 16,176 సగటు విన్నింగ్ మార్జిన్‌తో కైవసం చేసుకుంది. 2020లో ఆప్ 45 అర్బన్ నియోజకవర్గాలను గెలిచినప్పుడు విన్నింగ్ మార్జిన్ 22,076గా ఉంది. అదే సమయంలో బీజేపీ విన్నింగ్ మార్జిన్ 12,271గా ఉంది.
2020లో ఆప్ అర్బన్ నియోజకవర్గాల్లో సగటున 66,731 ఓట్లను సాధించింది. బీజేపీ 49,948 ఓట్లు, కాంగ్రెస్ 5,628 ఓట్లు సాధించాయి. కానీ 2025కు వచ్చేసరిక బీజేపీ సగటున 57,724 ఓట్లు, కాంగ్రెస్ 7,392 ఓట్లు సాధించాయి. ఈ రెండు పార్టీలు కలిస ఆప్ ఆధిపత్యానికి గండి కొట్టడంతో ఓట్ల సగటు 53,507కు పడిపోయింది. ఈ ఫలితాలను పరిశీలిస్తే అర్బన్ ఓటర్లు ఆప్ నుంచి బీజేపీకి.. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వైపునకు మళ్లినట్లుగా స్పష్టమవుతోంది.
2020 నుంచి 2025 మధ్యలో రూరల్ సీట్లలో ఆప్ సగటు ఓట్లు 83,584 నుంచి 72,006కు పడిపోయింది. అదే సమయంలో బీజేపీ 63,414 సగటు ఓట్ల నుంచి 79,158కి పెంచుకుంది. కాంగ్రెస్ ఓట్ల సగటు కూడా రూరల్ 7,259 నుంచి 11,735కు పెరిగింది.






