- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, అంబర్ పేట్: భర్త మరణం.. ఆ మహిళను కుంగిపోయేలా చేసింది. జీవనోపాధి లేక దిక్కుతోచని స్థితిలో పడేసింది. ముగ్గురు ఆడపిల్లల తల్లి అయిన ఆమె.. వారి కడుపు నింపేందుకు భర్త వృత్తినే కొనసాగించింది. కాటికాపరిగా మారింది. స్మశానవాటికకు వచ్చిన శవాలకు చితిని పేర్చి కాలేవరకు పూర్తిగా తానే చూసుకుంటుంది. అర్థరాత్రి అయినా సరే వెనుకాడకుండా.. కర్తవ్య నిర్వహణలో వందశాతం దీక్షతో ముందుకుసాగుతోంది.
అంబర్‌పేట్ గోల్నాకకు చెందిన జంగయ్య, వెంకటమ్మ కూతురు శ్రీదేవి పదో తరగతి వరకు చదువుకుంది. అనంతరం అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌తో వివాహం చేశారు తల్లిదండ్రులు. హర్రస్ పెంట స్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించిన ఆయన.. భార్య, ముగ్గురు పిల్లలకు ఆర్థికంగా అండగా ఉండేవాడు. కానీ, 15 ఏళ్ల దాంపత్య జీవనం నుంచి మరణం వారిని విడదీసింది. శ్రీదేవి భర్త శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో.. పిల్లల భారం ఆమెపైనే పడింది. దీంతో ఎలాంటి సంకోచం లేకుండా భర్త వృత్తినే తన వృత్తిగా మార్చుకుంది శ్రీదేవి. తనలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదని ఉన్నత చదువులను చదివిస్తుంది.
అయితే ఈ వృత్తిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నానన్న శ్రీదేవి.. అనాథ శవాల పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని తెలిపింది. కర్మకాండతో సహా దశ దినకర్మ కూడా చేస్తానంటోంది. రోజుకు 10 నుంచి 15 వరకు డెడ్ బాడీస్ అంతిమ సంస్కారం కోసం స్మశాన వాటికకు వస్తాయని చెప్పింది. ఇక కరోనా విపత్కర కాలంలో మహమ్మారితో చనిపోయిన వారికి కూడా కర్మకాండలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న ఆమె.. హిందూ స్మశానవాటిక సంస్థ కేటాయించిన క్వార్టర్స్‌లో నివసిస్తూ.. వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషిస్తుంది. మొత్తానికి ఈ ప్రపంచంలోకి ఓ జీవికి వెల్‌కమ్ చెప్పే డాక్టర్ నుంచి ముగిసిన జీవితానికి అంతిమ సంస్కారాలతో బైబై చెప్పే కాటికాపరి వరకు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న మాట వాస్తవమే.






