ఇరాన్ స్వాధీనం చేసుకున్న షిప్‌ నుంచి క్షేమంగా తిరిగి భారత్‌కు వచ్చిన మహిళ

by Disha Web Desk 17 |
ఇరాన్ స్వాధీనం చేసుకున్న షిప్‌ నుంచి క్షేమంగా తిరిగి భారత్‌కు వచ్చిన మహిళ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఏప్రిల్ 13న హార్ముజ్ జలసంధి సమీపంలో ఒక కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ షిప్‌లో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా, వారిలో17 మంది భారత్‌కు చెందిన వారే. గత కొద్ది రోజులుగా వారిని క్షేమంగా తిరిగి భారత్‌కు రప్పించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తుండగా, తాజాగా కొంత మేరకు కృషి ఫలించింది. గురువారం ఆ సిబ్బందిలో ఒకరు తిరిగి భారత్‌కు క్షేమంగా వచ్చారు. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కంటైనర్ షిప్‌లో మిగిలిన 16 మందిని కూడా సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

షిప్‌లో ఉన్నటువంటి మిగిలిన సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని, భారత్‌లోని వారి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. జోసెఫ్ ఇండియాలో అడుగుపెట్టడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, శ్రీమతి ఆన్ టెస్సా జోసెఫ్ స్వదేశానికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. మోడీ కి గ్యారెంటీ ఎల్లప్పుడూ స్వదేశంలో లేదా విదేశాలలో ఉంటుందని అన్నారు. అంతకుముందు, భారత సిబ్బందిని తిరిగి రప్పించడానికి ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు.

Next Story

Most Viewed